దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు | - | Sakshi
Sakshi News home page

దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు

Jul 20 2025 6:05 AM | Updated on Jul 21 2025 5:27 AM

దళితు

దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు

చాపాడు : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం.. 30 ఏళ్లుగా సిమెంట్‌ రోడ్డుకు నోచుకోని మండలంలోని తిప్పిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ(దళితవాడ)కి మెయిన్‌ రోడ్డు నుంచి 2019–20లో 14వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకం కింద రూ.4లక్షలతో ప్రభుత్వం సిమెంట్‌ రోడ్డు నిర్మించింది. ఆ సమయంలో రోడ్డు నిర్మాణం చేపట్టే స్థలం తమదని మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత నందిమండలం మల్లికార్జునరెడ్డి అడ్డుపడ్డాడు. ఎస్సీ కాలనీ లే అవుట్‌లో దారి స్థలం ఇదేనని అధికారులు తేల్చడంతో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఈ రోడ్డు నిర్మాణంపై ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం తన అనుచరులతో వచ్చి జేసీబీతో 40 కుటుంబాల వారు నివసిస్తున్న దళితవాడకు వెళ్లే సిమెంట్‌ రోడ్డు పూర్తిగా తొలగించి ధ్వంసం చేయించాడు. ఈ సమయంలో దళితవాడకు చెందిన వారందరూ ఉపాధి హామీ పనులకు వెళ్లగా అక్కడ ఉండే కొంత మంది రోడ్డు తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమను బెదిరించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దళితులందరూ ఇంటికి రాగా అప్పటికే వారి ఇళ్లకు వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయి ఉంది. దీంతో ఫోన్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరి సంఘటన స్థలాన్ని పరిశీలించి దళితులను విచారించారు. ఈ రోడ్డును టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి తొలగించినట్లు వారు ఎంపీడీఓ వీరకిషోర్‌కు తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చిన్న పెద్దయ్య సంఘటనా స్థలం వద్దకు చేరుకుని రోడ్డు తొలగింపును పరిశీలించారు. ఈ చర్యను అడ్డుకోబోగా అనంతపురం, ఓబాయపల్లె, నక్కలదిన్నె గ్రామాలకు చెందిన టీడీపీ వర్గీయులు చంపుతామని బెదిరించి భయాందోళనకు గురి చేసినట్లు వారు ఎస్‌ఐ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు తొలగింపు ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక దళితులు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య, డిప్యూటీ తహసీల్దారు కృష్ణారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ స్థలంపై తనకు హక్కు ఉందని కోర్టులో దీనిపై కేసు నడుస్తోందని స్టే కూడా ఉందని మల్లికార్జునరెడ్డి చెబుతున్నాడు.

ఎంపీడీఓ ఏమన్నారంటే..

తిప్పిరెడ్డిపల్లె దళితవాడకెళ్లే రోడ్డును టీడీపీ నేత తొలగించడంపై ఎంపీడీఓ వీర కిషోర్‌ను వివరణ కోరగా.. ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును తొలగించడం చట్టరీత్యా నేరమన్నారు. రోడ్డు తొలగింపు, స్థల సమస్యపై రెవెన్యూ అధికారులతో కలసి సమగ్ర విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లెలో

టీడీపీ నేత దుశ్చర్య

టీడీపీ నేత మల్లికార్జునరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు : దళితులు

30 ఏళ్ల క్రితం ఊరి బయట ఉన్న తాము ఇళ్లు నిర్మించుకునేందుకు పామిడి బుడ్డయ్య కుమారుడు వీరయ్య నుంచి ఇంటింటికి చందాలు వేసుకుని 70 సెంట్ల స్థలం కొనుగోలు చేశామని దళితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ కాలనీ పెద్ద మనిషి గయన్నతో పాటు మరికొందరు పెద్ద మనుషుల నిర్ణయంతో ఊర్లో పెద్ద మనిషిగా ఉన్న నందిమండలం వీరారెడ్డి పేరుతో స్థలం రాయించుకున్నామన్నారు. అప్పటి నుంచి వీరారెడ్డి పేరు మీదనే స్థల పత్రాలు ఉన్నాయన్నారు. వీరారెడ్డి తమ్ముడి కుమారుడు అయిన పడమర అనంతపురం గ్రామంలో ఉన్న టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ స్థలం తమ పెదనాన్నదని తనకు హక్కు ఉందని వస్తున్నాడని, గతంలో అధికారులు చెప్పినా వినకుండా ఇప్పుడు ఇలా దౌర్జన్యంగా రోడ్డును తొలగించాడని దళితులు వాపోతున్నారు.

దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు 1
1/1

దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement