
అదుపు తప్పిన చైతన్య స్కూల్ బస్సు
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు అదుపు తప్పి ఒక వైపు ఒరిగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. శనివారం రాయచోటికి చెందిన శ్రీ చైతన్య స్కూల్ బస్సు సుండుపల్లె నుంచి రాయచోటికి వస్తుండగా శిబ్యాల గ్రామం అనుంపల్లె సమీపంలో బస్సు బ్రేక్‌లు పని చేయకపోవడంతో ఒక్కసారిగా సైడు కాలువ వైపు ఒరిగిపోయింది. అక్కడ మరో చిన్న కాలువ ఉండటంతో అందులో ముందు వైపు టైర్ ఇరుక్కుపోవడంతో ఆగిపోయింది. ఈ కాలువ లేకుంటే సైడ్ కాలువలో పడి చిన్నారులకు గాయాలయ్యేవి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆవు–ఎద్దులను ఢీకొన్న కారు
సిద్దవటం : మండలంలోని చాముండేశ్వరీపేట గ్రామం సెయింట్ ఆంథోనీ హైస్కూల్ సమీపంలో శనివారం ఆవు–ఎద్దులను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆవు, ఎద్దు అక్కడికక్కడే మృతి చెందాయి. కడప– చైన్నె జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. మేతకు రైల్వే ట్రాక్ అవతలికి వెళ్లి తిరిగి నేకనాపురం గ్రామానికి వెళ్లేందుకు ఆవు, ఎద్దు రోడ్డు దాటుతుండగా కడప నుంచి రాజంపేట వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఆవు, ఎద్దులను ఢీకొంది. ఈ ప్రమాదంలో నేకనాపురం గ్రామ పాడి రైతులు సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డిలకు చెందిన ఆవు, ఎద్దు మృతి చెందాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ కారు డ్రైవర్ అబ్దుల్లాను విచారించారు.
గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. రంగసముద్రం పంచాయతీ కుర్రావాండ్లపల్లెకు చెందిన నరేష్‌బాబు అలియాస్ భూషణ(27) స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం పూటుగా మద్యం తాగి వ్యక్తిగత సమస్యలతో మనస్తాపం చెంది బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. బి.కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

అదుపు తప్పిన చైతన్య స్కూల్ బస్సు

అదుపు తప్పిన చైతన్య స్కూల్ బస్సు