
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
చిన్నమండెం : కడప–బెంగళూరు జాతీయ రహదారిలోని బెస్తపల్లె క్రాస్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఉసిరికాయల వీరాంజనేయులు(40) మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల కథన మేరకు.. మండల పరిధిలోని కేశాపురానికి చెందిన వీరాంజనేయులు, శ్రీనివాసులు తమ సొంత పనుల నిమిత్తం చిన్నమండెంకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతిచెందగా గాయపడిన శ్రీనివాసులును 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిరువురూ ఇటీవలే కువైట్ నుంచి రాగా.. మళ్లీ తిరిగి అక్కడికి వెళ్లాల్సి ఉంది. మృతుడు వీరాంజ నేయులు భార్య కువైట్‌లో ఉండగా వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నమండెం పోలీసులు తెలిపారు.
ఆకులవారిపల్లెలో కోడి పందాలు
– పోలీసుల దాడుల్లో నలుగురు అరెస్ట్
బి.కొత్తకోట : మండలంలోని ఆకులవారిపల్లె చెరువులో బుధవారం భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల నుంచి వచ్చిన వారితో పెద్దమొత్తంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అందుబాటులో ఉన్న సిబ్బందితో హెడ్‌కానిస్టేబుల్ బి.విశ్వనాథరెడ్డి దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొడిపందెం రాయుళ్లు పరుగులు తీశారు. ఒక కోడి, ఏడు బైక్‌లు, రూ.700 నగదు స్వాధీనం చేసుకున్నారు. కటారి అంజి(50), రామరాజుపల్లె శ్రీనివాసులురెడ్డి(45), చిప్పలమడుగు మోహన(43), తుపాకుల వెంకటరమణ(38)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని విశ్వనాథరెడ్డి తెలిపారు. సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటంతో నలుగురిని పట్టుకోగలిగామని మిగిలిన వాళ్లు కోళ్లు, డబ్బుతో పరారయ్యారని తెలిపారు.
జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పొడిగింపు
కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా గడువు 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించిందని ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారీ రూ.2 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందుతాయన్నారు. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియో గించుకోవాలన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు హెల్త్ స్కీం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి