
హక్కుల సాధనకు సమష్టి పోరాటం
ఒంటిమిట్ట : హక్కుల సాధనకు సమష్టి పోరాటం చేయాలని నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబన్ తెలిపారు. ఆదివారం ఒంటిమిట్ట మండలంలోని హరిత కల్యాణ మండపంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గుటూరు రాజా, జిల్లా అధ్యక్షులు సుంకేశుల బాషా అధ్యక్షతన నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచపల్లికి చెందిన సుబాన్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో దూదేకులకు రూ.100 కోట్లతో కూడిన నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు, హైకోర్టులో ఉన్న 4.5 శాతం రిజర్వేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దూదేకులు తమ పిల్లల టీసీల్లో ఇండియన్ ఇస్లామ్ పేరుతో సర్టిఫికెట్లు తీసుకోవాలని తెలిపారు. నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ మాట్లాడుతూ దూదేకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలిపారు. నూర్ బాషా –దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ, దూదేకుల సంఘం నాయకులు ప్రొద్దుటూరుకు చెందిన నాగూర్, కడప బుజ్జి, రిటైర్డ్ ఎంపీఓ కులాయప్ప మాట్లాడారు.
అనంతరం జిల్లా యువజన అధ్యక్షులుగా కడప నగరానికి చెందిన నరసింహ కుమార్, ఒంటిమిట్ట మండల అధ్యక్షులు ఇస్మాయిల్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్నమయ్య, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల, గుంటూరు, విజయవాడ తదితర జిల్లాలకు చెందిన దూదేకుల సంక్షేమ సంఘం నాయకులు, కడప జిల్లాకు చెందిన సంఘం నాయకులు, రిటైర్డ్ ఎస్‌ఐ కుళాయప్ప, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మస్తాన్, రాచపల్లి మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, పగడాల దస్తగిరి, గగ్గుటూరి మౌలాలి, మస్తాన్, బాబయ్యతోపాటు వందలాది మంది సభ్యులు పాల్గొన్నారు.