
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
గాలివీడు : భార్య కాపురానికి రాలేదని తుపాకుల గోపాల్ (37) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో జరిగింది. ఎస్‌ఐ రామకృష్ణ కథనం మేరకు అరవీడు గ్రామం మలసానివాండ్లపల్లెకు చెందిన తుపాకుల వెంకటరమణ, రమణమ్మ దంపతుల కుమారుడు గోపాల్ మద్యానికి బానిసై భార్య రమణమ్మ, నలుగురు సంతానాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో అతని భార్య మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన గోపాల్ తన భార్య తిరిగి కాపురానికి రాదేమోనన్న సందేహంతో ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్యా యత్నం
మదనపల్లె సిటీ : కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం కురబలకోట మండలం సర్కారుతోపు వద్ద ఉన్న బండ్లపల్లెలో జరిగింది. బండ్లపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి (30) ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మర్యాదగా మట్లాడమంటే దాడి చేశారు
మదనపల్లె రూరల్ : వైన్‌షాపు వద్ద ఏర్పడిన వివాదంలో మర్యాదగా మాట్లాడమంటే ఓ వ్యక్తిపై నలుగురు దాడి చేసిన ఘటన ఆదివారం సాయంత్రం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని డివి జగన్ కాలనీకి చెందిన జనార్దన్ కుమారుడు కార్తీక్(30) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె వద్ద ఉన్న వైన్‌షాపు వద్దకు మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గాంధీపురానికి చెందిన గౌతమ్‌తో వివాదం ఏర్పడింది. మాటామాటా పెరగడంతో కార్తీక్ వయస్సులో పెద్దవాడినైన తనను మర్యాదగా మాట్లాడాలంటూ గౌతమ్‌ను హెచ్చరించాడు. దీంతో ఆవేశానికి లోనైన గౌతమ్ తన అనుచరులు మరో ముగ్గురితో కలిసి దాడికి పాల్పడి విచక్షణారహితంగా కొట్టాడు. మరో సారి ఫోన్ చేసి పిలిపించి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కార్తీక్‌పై దాడి చేసి కొట్టాడు.