ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి: కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారుల సూచనలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహాయంతో చేపడుతున్న జల జీవన్ మిషన్ పథకంపై కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులైన మీను శుక్ల పాఠక్, చీఫ్ ఇంజినీర్ ఎస్పీ శెట్టిలు గ్రామీణ నీటి సరఫరా శాఖ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జలజీవన్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా 3709 పనులు మంజూరయ్యాయని, ఇందులో 2225 పనులు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధదశల్లో ఉన్నాయని జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ప్రసన్న కుమార్ వివరించారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 44 మండలాల్లో 6967 నివాసాల్లో నివసిస్తున్న 31 లక్షల, 87వేల, 66 మందికి రెండు ఫేసులలో గండికోట, వెలిగల్లు రిజర్వాయర్ల ద్వారా కరువు ప్రాంతాలకు తాగునీటిని అందించడం కోసం 2370 కోట్ల రూపాయలతో ఏప్రిల్ 2025లో ప్రారంభించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అక్టోబర్ 2027 కల్లా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ ప్రాజెక్టు మొదటి ఫేసులో పీలేరు, తంబళ్లపల్లి, రాయచోటిలోని 18 మండలాల్లో 241 గ్రామ పంచాయతీలకు నీటి సరఫరా అందిస్తామన్నారు. మొదటి ఫేసులో గండికోట రిజర్వాయర్ ద్వారా 1.683 టీఎంసీల నీటిని, వెలిగల్లు రిజర్వాయర్ ద్వారా 0.175 టీఎంసీ నీటిని కరువు ప్రాంతాలకు అందించేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు ప్రసన్న కుమార్ కేంద్ర బృందానికి తెలియపరిచారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా భౌగోళిక స్వరూపం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుందన్నారు. భూగర్భజలాలు ప్రజలకు అందుబాటులో లేవని, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా అత్యంత అవసరమని కేంద్ర ప్రభుత్వ బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.


