పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాజంపేట టౌన్: భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛాముకూరి పిలుపునిచ్చారు. రాజంపేట–రాయచోటి మార్గంలో ఉన్న నగరవనంలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.కలెక్టర్ శ్రీధర్, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి , ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముఖ్య అతిధులుగా పాల్గొని మొక్కలను నాటారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది నిర్వహించే వనమహోత్సవం నాటికి జిల్లాలో 21 లక్షల మొక్కలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి పెరిగే కొద్ది పుడమి తల్లికి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నింగి, నేల, గాలి కలుషితం అవుతున్నాయన్నారు. ఇది మానవ మనుగడకు శ్రేయస్కరం కాదని తెలిపారు. ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రాణవాయువు కోసం ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పెంచాలని తెలిపారు. కాగా రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, సబ్‌కలెక్టర్లు వైఖోమ్ నైదియాదేవి, మేఘస్వరూప్, డిఎఫ్‌ఓ ఆర్.జగన్నాధ్‌సింగ్, రాజంపేట ఏఎస్పీ మనోజ్‌రామనాధ్‌హెగ్డె, సబ్‌డీఎఫ్‌ఓలు జి. సుబ్బరాజు, ఎస్.శ్రీనివాసులు మొక్కలను నాటారు.
డీఎస్సీ పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి సన్నద్ధత
రాయచోటి: జిల్లాలో ఆరు కేంద్రాలలో మెగా డిఎస్సీ పరీక్ష నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఒకటిన్నర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి మించి నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. జిల్లాలో ఆరు కేంద్రాలలో ఈనెల 6వ తేదీ నుండి జూన్ 27 వరకు మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. 17851 మంది మెగా డీఎస్సీ పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. మదనపల్లెలో మూడు, రాజంపేటలో ఒకటి, రాయచోటిలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. కొన్ని రోజులు మూడు సెషన్లలో పరీక్షలు ఉంటాయన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏపీఎస్‌ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు.
జిల్లాలోని ప్రజలు జనాభా నిర్వహణ విధానంలో అభిప్రాయాలను ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పిలుపునిచ్చారు. గురువారం జనాభా నిర్వహణ విధానంపై ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను ఆవిష్కరించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి


