అదుపు తప్పి వాహనం బోల్తా
● ఒకరి మృతి
● ముగ్గురికి తీవ్ర గాయాలు
సిద్దవటం : సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్ద శనివారం బొలేరో పికప్ లగేజీ వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జింకా చంద్ర(44) అనే వ్యక్తి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. డప ఉక్కాయపల్లె వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన జింకా చంద్ర కూలి పనిచేసుకొని జీవించేవాడు. ఇతనికి బద్వేలులోని శ్రీకృష్ణ దేవరాయ నగర్‌లో 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారని, స్థలం చుట్టూ ప్రహరీ ఏర్పాటుకు శనివారం కడప నుంచి సిమెంటు ప్లేట్లు, స్తంభాలు తీసుకొని కూలీలతో బొలెరో పికప్ లగేజి వాహనంలో బద్వేల్‌లుకు బయలుదేరాడు. వాహనం సిద్దవటం గ్రామ శివారులోని ఉషా గార్డెన్ వద్దకు రాగానే ఎదురుగా ఎద్దు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జింకా చంద్రకు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు అబ్దుల్‌బార్, ఆర్‌బాజ్, అఫ్సర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అయితే జింకా చంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అదుపు తప్పి వాహనం బోల్తా


