
నిండు చూలాలిని చూడకనే.. తండ్రి మృతి
● కుమార్తె కోసం కువైట్ నుంచి వస్తూ
విదేశాల్లో చనిపోయిన తండ్రి
● రూ.2.5 లక్షలు కడితే మృతదేహం
ఇస్తామన్న ఆస్పత్రి నిర్వాహకులు
రాజంపేట: నిండు చూలాలైన తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు విదేశాల నుంచి బయలుదేరిన తండ్రి.. ఆస్పత్రి పాలై కానరాని లోకాలకు చేరారు. మృతదేహం కావాలంటే రూ.2.5 లక్షలు కట్టాలంటూ కొలంబో ఆస్పత్రి వారు చెప్పడంతో కడచూపుకై నా నోచుకోలేకపోతున్నామని తల్లి, కుమార్తెలు కన్నీరు మున్నీరవుతున్నారు. రాజంపేటలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన రాజుబోయిన మనోహర్(45) రాజంపేట పట్టణంలోని రామనగర్‌లో నివాసముంటున్నారు. బ్రతుకు దెరువు కోసం ఎనిమిది నెలల కిందట కువైట్‌కు వెళ్లారు. ఇతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె మౌనిక, కుమారుడు ఉన్నారు. కుమార్తె నిండు చూలాలు కావడంతో బిడ్డకు కాన్పు చేయించేందుకు తండ్రి ఈ నెల 17న ఇండియాకు వచ్చేందుకు కువైట్ విమానశ్రయంలో బోర్డింగ్ తీసుకున్నారు. అక్కడ శ్రీలంక విమానం ఎక్కినా.. ఇంటికి రాలేదు. దీంతో ఆయన భార్య రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా మనోహర్‌కు విమానంలో ఆరోగ్య సమస్య తలెత్తడంతో కొలంబో ఆస్పత్రిలో చేర్చారని, కోలుకోలేక అక్కడే మృతి చెందారని సమాచారం వచ్చింది. విషయం తెలుసుకుని భార్య, పిల్లలు బోరున విలపించారు. కడచూపుకై నా నోచుకుందామని అడిగితే.. రూ.2.5 లక్షలు కడితే మృతదేహంఇస్తామని కొలంబో ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. ఏమి చేయాలో తోచక ఇంటి వద్దే కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మనోహర్ మృత దేహాన్ని ఇండియాకు తెప్పించాలని వారు కోరుతున్నారు.
వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ చోరీ
గుర్రంకొండ : నాలుగు వ్యవసాయ బోర్లు, బావుల వద్ద వరుస చోరీలు జరిగిన సంఘటన మండలంలోని టి.రాచపల్లెలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన నలుగురు రైతులు గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం తమ పొలాల వద్దకు వెళ్లారు. కేబుల్ వైర్లు కత్తిరించి.. ఫీజు క్యారియర్లు బయటపడి ఉండడంతో వ్యవసాయ పరికరాలు చోరికి గురయ్యాయని గుర్తించారు. గ్రామానికి చెందిన రమేష్‌బాబు పొలంలో 30మీటర్ల కేబుల్, సురేంద్రరెడ్డి పొలంలో 50 మీటర్లు, రఘనాథరెడ్డి పొలంలో 45 మీటర్లు, సిద్ధమల్‌రెడ్డి పొలంలో 25 మీటర్ల కేబుల్ వైర్లు, ఫీజు కారియర్లు దోచుకెళ్లారు. రమేష్‌బాబు పొలంలో రూమ్ తాళాలు పగులగొట్టి అందులో వ్యవసాయ పరికరాలు, సామగ్రి తీసుకెళ్లారు. చోరికి గురైన వస్తువులు, కేబుళ్ల విలువ లక్ష రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిండు చూలాలిని చూడకనే.. తండ్రి మృతి