
ఉపాధిలో ‘చిలక్కొట్టుడు’ !
గాలివీడు : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతోంది. కూలీలకు బిల్లులు చెల్లింపులో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు తెర తీశారు. నీకింత.. నాకింత అంటూ వాటాలు పంచుకున్నారు. గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో దాదాపు 14వేల జాబ్ కార్డుదారులు ఉన్నారు. వీరిలో 5వేల మంది పనులకు వెళ్తున్నారు. వీరి అవసరాలు ఆసరాగా తీసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వారు పనులకు వెళ్తే ఓ రేటు.. వెళ్లకుంటే మరో రేటు పెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మస్టర్లలో పేరు నమోదు మొదలు బిల్లులు చెల్లింపు వరకూ వారి కనుసన్నల్లోనే జరుగుతోంది.
ఖాతాలో పడిన వెంటనే..
ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్ కార్డులు కలిగిన తమ అనుకూల ఉపాధి కూలీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఉపాధి బిల్లు మొత్తం బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే కూలీ తన అకౌంట్ నుండి తీసి ఎఫ్‌ఏలకు ఇవ్వాలి. దీనికి ఒప్పుకున్న వారి పేర్లు మాత్రమే ఉపాధి మస్టర్లలో చేరుస్తున్నారు. గ్రూపులుగా ఏర్పాటుచేసుకుని పనికి వెళ్లే వారైతే.. బిల్లు మొత్తం ఖాతాలో పడిన వెంటనే ఒక్కొక్క కార్డుదారుడు రూ.200 ఫీల్డ్ అసిస్టెంట్ కు ఇవ్వాలి. పనికి వెళ్లని వారైతే .. తమ ఖాతాలో బిల్లు జమ కాగానే 50 శాతం నగదు ఫీల్డ్ అసిస్టెంట్‌కు ముట్టజెప్పాల్సిందే. ఈ లెక్కన ఫీల్డ్ అసిస్టెంట్లు అప్పనంగా సొమ్ము ఆర్జిస్తున్నారు. ఇలా ఒక్కో పనికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఉపాధి అక్రమాలపై దృష్టి సారించి అక్రమ వసూళ్లను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
బిల్లుల చెల్లింపులో ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం