
లారీ డ్రైవర్ బీభత్సం
వల్లూరు : మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ ద్విచక్ర వాహనం, ప్రైవేటు బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న బంకు, దాని పక్కనే వున్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఐదుగురు గాయాలపాలవగా.. బంకుతోబాటు మూడు ద్విచక్ర వాహనాలు, బస్సు దెబ్బతిన్నాయి. వివరాల్లోకెలితే.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలపురానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ అబ్దుల్ అహమ్మద్ గురువారం గుజరా సామగ్రితో తాడిపత్రికి వెళ్తున్నారు. మద్యం మత్తులో కడప –తాడిపత్రి ప్రధాన రహదారిలో పాపాఘ్ని నగర్(కట్ట) బస్టాపు వద్ద లారీతో వేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని, దానికి ముందు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సును డీకొట్టాడు. అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న బంకును, దాని పక్కనే పార్కు చేసి వున్న రెండు ద్వి చక్రవాహనాలపై ఎక్కించాడు. చివరకు అదుపు తప్పి పక్కనే వున్న చెట్టును ఢీకొట్టాడు. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కు యాడు. స్థానికులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎస్‌ఐ పెద్ద ఓబన్న తన సిబ్బందితో వచ్చి జేసీబీ సహాయంతో లారీని కదిలించి రెండున్నర గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
● లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులతో బాటు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మితిమీరి మద్యం తాగి నడపడమే కారణంగా తెలుస్తోంది.
మద్యం మత్తులో బస్సును ఢీకొట్టి..
ఐదుగురికి గాయాలు.
క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

లారీ డ్రైవర్ బీభత్సం