
పాజిటివ్ థింకింగ్‌కు ప్రపంచాన్ని మార్చే శక్తి
కురబలకోట : పాజిటివ్ థింకింగ్ (సానుకూల ధృక్పథం)కు దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడంతో పాటు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని రాష్ట్ర బార్ కౌన్నిల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది, సైకాలజిస్టు అతిక్ అహమ్మద్ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పాజిటివ్ థింకింగ్ శక్తిపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్ థింకింగ్ జీవితాలను మార్చ గల గొప్ప ఆయుధంగా చెప్పవచ్చన్నారు. ప్రతి కూలాన్ని కూడా అనుకూలంగా మారుస్తుందన్నారు. లక్ష్య సాధనకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మనస్సును మార్చడంతో పాటు వ్యక్తులపై ప్రభావం చూపుతుందన్నారు. పాజిటివ్ థింకింగ్ విజయానికి సోపానం కాగలదని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ పుణ్య క్షేత్రమైన శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవదాయశాఖ కార్యనిర్వహణ అధికారీ గంగవరం కొండారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
నేడు వ్యాసరచన పోటీలు
రాయచోటి జగదాంబసెంటర్ : స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి బీట్ ది హీట్ అనే అంశంపై రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 6–10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వినియోగదారులకు
మెరుగైన విద్యుత్ అందించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో రూ.10 లక్షలతో రీ మోడల్ చేసిన ఎస్‌ఈ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన సందర్భంగా రాయచోటిలో ఏపీఎస్పీడీసీఎల్ నూతన ఎస్‌ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, పాల్గొన్నారు.
అధికారుల మాక్‌డ్రిల్
రాయచోటి టౌన్ : ఊహించని విపత్తులు సంభవిస్తే ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోంశాఖ ఆదేశాల మేరకు భారత పౌరులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనే విషయాల గురించి వివరించి చెప్పారు. ఈసందర్భంగా రాయచోటి ఆర్‌డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతానికి యుద్ధం ఆగిందని భవిష్యత్‌లో అనివార్యమైతే ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలియచేసేందుకు ఈ మాక్ డ్రిల్ ప్రదర్శన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో సైరన్ మోగుతుందని అప్పుడు ఎలా అప్రమత్తం అవ్వాలో ప్రదర్శన ద్వారా తెలియజేశామని చెప్పారు. అలాగే ప్రమాద స్థలాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలో కూడా వివరించారు. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఉషశ్రీ, రాయచోటి సీఐ వెంకట చలపతి,ఫైర్ స్టేషన్ అఽధికారి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

పాజిటివ్ థింకింగ్‌కు ప్రపంచాన్ని మార్చే శక్తి