
బి.కొత్తకోట : టెంపో వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి బి.కొత్తకోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వంశీకృష్ణ (25) అవివాహితుడు. స్థానిక కోటవీధిలో నివాసం ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం పై అధికారి గ్రామాల పర్యటనకు రావడంతో నాయనబావి వద్ద బైక్ ఉంచి అధికారి వెంట తిరిగాడు. తర్వాత నాయనబావికి వెళ్లి బైక్‌పై బి.కొత్తకోటకు వస్తున్నాడు.
కస్తూర్బా స్కూల్ సమీపంలో మదనపల్లె వైపు దూడలతో వెళుతున్న టెంపో వాహనం బైకును ఢీ కొట్టింది. బైక్‌తోపాటు వంశీకృష్ణను కొంత దూరం ఈడ్చుకుని వెళ్లింది. తర్వాత టెంపో రోడ్డు పక్కన బోల్తా పడింది. వంశీకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. టెంపో డ్రైవర్ పరారయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. ఏఎస్‌ఐ భాస్కర్, పోలీసులు ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని మదనపల్లెకు తరలించారు.