
మదనపల్లె మున్సిపాలిటీలో రూ.29 లక్షలు స్వాహా
మదనపల్లె : మదనపల్లె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో రహస్యంగా దాగిన రూ.29.50 లక్షల నిధుల స్వాహా వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మున్సిపాలిటీకి పైసా సొమ్ము చెల్లించినా ఆ సొమ్ము జమ చేసినట్టు ఆన్‌లైన్ బిల్లు ఇస్తారు. అయితే లక్షలు జమ చేసిన లీజుదారునికి ఆన్‌లైన్ రశీదు కాకుండా చేతిరాత రశీదు ఇచ్చి మొత్తాన్ని స్వాహా చేసిన వ్యవహారంపై అనంతపురం మున్సిపల్ ఆర్డీ విశ్వనాఽథ్ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2023లో జరిగిన ఈ స్వాహాపై ఇప్పటివరకు కనీస చర్య లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ అధికారులకు తెలిసినా ఈ వ్యవహారాన్ని దాచిపెట్టడం వెనుక కారణమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
అసలు కథ ఇదీ..
2022 ఏప్రిల్ ఒకటి నుంచి 2023 మార్చి 31 వరకు మున్సిపాలిటీకి చెందిన వారపుసంత, దినసరి మార్కెట్, జంతువధ శాలను రూ.94.55 లక్షలకు సయ్యద్ ఫారూక్ అహ్మద్ గుత్త దక్కించుకున్నాడు. ఈ గుత్త సొమ్మును పూర్తిగా చెల్లించాల్సిన గుత్తదారుడు విడతల వారీగా చెల్లింపులు చేశాడు. ఈ మొ త్తంలో రూ.55 లక్షలను చెల్లించినట్టు ఆన్‌లైన్ రశీదు లు ఇచ్చారని తెలిసింది. మిగిలిన దాంట్లో రూ. 29.50 లక్షలను మున్సిపాలిటీకి చెల్లించాడు. మూడు విడతల్లో 2023 ఏప్రిల్ 18న రూ.10 లక్షలు, మే నెల 17న రూ.10 లక్షలు, మే నెల 27న రూ.9.50 లక్షలు చెల్లించాడు. అయితే ఈ సొమ్ము స్వీకరించిన ఉద్యోగి ఈ చెల్లింపులు ఆన్‌లైన్‌లో జమచేసి ఆన్‌లైన్ చెల్లింపు బిల్లులు ఇవ్వాలి. అయితే అలా చేయకుండా నగదు స్వీకరించినట్టుగా మున్సిపాలిటీకి చెందిన క్యాష్ రీసీవ్‌డ్ సీలు వేసి అందులో ఎంత మొత్తం తీసుకున్నది చేతిరాతతో సంతకం చేసి రశీదులు ఇచ్చా డు. దీనితో తన లీజు సొమ్ము చెల్లించేశానని గుత్తదారు భావించాడు. అయితే ఈ సొమ్ము మున్సిపాలిటీకి జమకాలేదు. రూ.29.50 లక్షల్లో పైసా కూడా జమ చేయకుండా పూర్తిగా స్వాహా చేసేశారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. వాస్తవంగాపై నిధులు గుత్తదారుడు చెల్లించకపోయి ఉంటే ఈపాటికే అధికారులు చర్యలు తీసుకోవాలి. అయినా ఎందుకు తీసుకోలేదో అధికారులకే తెలియాలి.
రెండేళ్లుగా దాచిపెట్టారు..
రూ.29.50 లక్షల నిధులు స్వాహా వ్యవహారాన్ని అధికారులు రెండేళ్లుగా దాచి పెట్టడం వెనుక కారణమేమిటన్న చర్చ మొదలైంది. మున్సిపల్ నిధుల వ్యవహారంపై నిత్యం జరగాల్సిన పర్యవేక్షణ జరగడం లేదా, లేక తెలిసి ఈ విషయాన్ని పట్టించుకోలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిధుల స్వాహాపై ఇప్పటికే చర్యలు పూర్తి చేసి ఉంటే స్వాహా సొమ్మును తిరిగి రాబట్టి ఉండవచ్చు. లేదా గుత్తేదారుని ఫిర్యాదుతో స్వాహా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా రశీదులు ఇచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రెండేళ్లదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదో అధికారులకే తెలియాలి.
ముగ్గురికి షోకాజ్..
గుత్తేదారు చెల్లించాల్సిన సొమ్ము విషయంలో అనంతపురం మున్సిపల్ ఆర్డీ విశ్వనాఽథ్ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో అప్పటి మున్సిపల్ ఆర్‌ఓ, ప్రస్తుత బి.కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ పల్లవి, జూనియర్ అసిస్టెంట్ రెడ్డిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తిలకు ఈ నెల ఏడున షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గుత్తల సొమ్ము వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నట్టు తెలిసింది.
గుత్తలకు సంబంధించి చెల్లించిన సొమ్ముకు చేతిరాతతో
రశీదు ఇచ్చిన ఉద్యోగి
మున్సిపాలిటీకి జమ చేయకుండా
మొత్తం స్వాహా
రెండేళ్లుగా దాచిపెట్టిన అధికారులు
బి.కొత్తకోట కమిషనర్, మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు
జారీ చేసిన మున్సిపల్ ఆర్‌డీ

మదనపల్లె మున్సిపాలిటీలో రూ.29 లక్షలు స్వాహా