
కమనీయం.. లక్ష్మీ నృసింహుని కల్యాణం
రాజంపేట రూరల్ : జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం భువనగిరి శ్రీలక్ష్మీదేవి సమేత నృసింహ స్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత కమనీయంగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ నృసింహ స్వామి ఉత్సవ మూర్తులను తొలుత పట్టు వస్త్రాలతో, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి ఆలయ ప్రధాన అర్చకులు జయంతి నటరాజశర్మ, ధూళిపాటి కృష్ణమోహన్, వేదపండితులు అవధానం రాజశేఖరశర్మ, ధూళిపాటి కాళీచరణ్‌శర్మ, షడ్దర్శనం సత్యనారాయణ, నందుల బృందం వేదమంత్రోచ్ఛారణతో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తజనం స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోయారు. స్వామి వారికి భువనగిరిపల్లి కోదండరామస్వామి ఆలయం నుంచి కొండపైకి మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు పసుపులేటి వీరప్రదీప్, రమ్య, పసుపులేటి పవన్‌కుమార్, సింధు దంపతులు ఆలయ ధర్మకర్తలతో కలిసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. క్రిష్ణచైతన్య అన్నదాన ట్రస్ట్ కువైట్ అధ్యక్షుడు ఇండ్లూరు వజ్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు మజ్జిగ, మంచినీరు ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథిగా
3వ అదనపు జిల్లా జడ్జి..
ఈ కల్యాణ వేడుకలలో ముఖ్య అతిథులుగా 3వ అదనపు జిల్లా జడ్జి ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రత్యూష దంపతులు, జనసేన నాయకుడు అతికారి కృష్ణ పాల్గొన్నారు. ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే ఆధ్వర్యంలో అర్బన్ సీఐ రాజా నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అర్బన్ ఎస్‌ఐ ఎస్‌ఎల్‌వీ ప్రసాద్‌రెడ్డి, ఏఎస్‌ఐలు సీఎస్‌కే ప్రసాద్‌వర్మ, ఖాసీంసాబ్, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించారు.

కమనీయం.. లక్ష్మీ నృసింహుని కల్యాణం