
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్/తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి పంచాయతీ దిగువ మావిళ్లవారిపల్లెకు చెందిన చిన్నారెడ్డి కుమారుడు డీవీ సిద్ధారెడ్డి (43), ఈ నెల 10న సొంత పనులపై ద్విచక్ర వాహనంలో వెళుతుండగా, మావిళ్లవారిపల్లె కన్నెమడుగు మార్గంలోని నాయిని చెరువు వద్ద మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో సిద్ధారెడ్డి తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ కావడంతో, సిద్ధారెడ్డిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఈనెల 11న తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించడంతో, ఏఎస్‌ఐ నరసింహులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే ఆర్థిక సాయం..
మృతునికి భార్య నాగమణి, ఇంటర్ చదువుతున్న కుమార్తె రంజిత, పదో తరగతి పాసైన కుమారుడు భతర్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కుకోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆ గ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటానని భరోసా కల్పించారు. సర్పంచులు జ్యోతి, శివకుమారి, ఎంపీటీసీ సభ్యులు మహేష్, నాయకులు చంద్రశేఖరరెడ్డి, కె.ఆర్.మల్లిరెడ్డి, రామశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి