
ఆర్టీసీ కార్మికుల ధర్నా
రాయచోటి టౌన్ : నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఐదు డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షుడు వినోద్ బాబు మాట్లాడుతూ సంస్థలో ఉద్యోగులను చిన్న చిన్న కారణాలతో అధికారులు వేధించడం తగదన్నారు. ఉద్యోగ భద్రత సర్క్యులర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి రావాల్సిన ప్రమోషన్లు వెంటనే కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించాలని, మహిళా సిబ్బందికి చైల్డ్‌కేర్ లీవ్‌లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రీజనల్ కార్యదర్శి పీఎస్‌ఎం రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ ఎంఎన్‌రావు, రీజనల్ మహిళా నాయకురాలు విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పీలేరులో చోరీ
పీలేరు రూరల్ : పీలేరు పట్టణం చెన్నారెడ్డి కాలనీలోని ఓ ఇంటిలో బంగారు, నగదు చోరీ జరిగిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చెన్నారెడ్డి కాలనీకి చెందిన వి. శ్రీనివాసులురెడ్డి, రజనికుమారి దంపతులు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వేపులబైలులో జరిగిన అంకాలమ్మ జాతరకు వెళ్లారు. తిరిగి ఉదయం 6.30 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచి బీరువా పగులగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బాలకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు. ఇంటి నిర్మాణం కోసం బీరువాలో దాచుకున్న రూ. 5 లక్షలు నగదుతోపాటు సుమారు 150 గ్రాముల బంగారు చోరీకి గురైందని బాధితులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల ధర్నా