
● దళారులు, వ్యాపారుల ములాఖత్
సాక్షి రాయచోటి : మామిడి రైతులకు ఈసారి కష్టకాలమే కనిపిస్తోంది. ఆశించిన మేర పంట దిగుబడులు లేవు...ప్రకృతి కరుణించక, తెగుళ్లు బారినపడి...తెగులు, చలి, మంచు ప్రభావం మామిడి రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. భారీగా ఉన్న అంచనాల నుంచి కొంతమేరనే వచ్చిన దిగుబడి రైతులను కుంగదీస్తోంది. పెద్ద చెట్ల నుంచి ఎకరాకు ఐదు టన్నులకు పైగా దిగుబడి వచ్చే పరిస్థితి నుంచి టన్నుకూడా వచ్చే పరిస్థితి లేకపోయింది. పైగా ఇటీవల అంతో ఇంతో ఉన్న కాయలను కూడా రెండు, మూడు దఫాలుగా వచ్చిన పెనుగాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. చెట్లపై ఉన్న కాయలు రాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో అన్నదాత కనీస ధరలు ఉంటాయని భావించినా నిరాశే ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా ధరలు పడిపోయాయి. దేశ స్థాయిలో వీరబల్లి బేనీషాకు పేరున్నా...ఆ కాయలు కూడా ప్రస్తుతం టన్ను రూ. 30–35 వేలకు పడిపోవడం ఆందోళన కలిగించే పరిణామం.
మామిడి రైతును దెబ్బతీసిన ప్రకృతి
అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. అందులో సుమారు 20 వేల హెక్టార్లలో పెద్ద పెద్ద మామిడి తోటలు ఉన్నట్లు ఉద్యానశాఖ అంచనా. ఈసారి ప్రకృతి దెబ్బకు మామిడి రైతు పూర్తిగా దెబ్బతిన్నాడు. ప్రధానంగా గత నవంబరు, డిసెంబరులో మంచు ప్రభావంతో వచ్చిన పూత, పిందె రాలిపోయి దెబ్బతినడం ఒక ఎత్తయితే, తర్వాత వచ్చిన బంక తెగులు చెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. మరోపక్క పెనుగాలులు, వడగండ్ల వాన రాయచోటి నియోజకవర్గంతోపాటు రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు తదితర ప్రాంతాల్లో కాయలు రాలిపోయాయి. తోటలపై కేవలం 15–20 శాతం మాత్రమే అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి. ప్రకృతి దెబ్బకు ఈసారి పెద్ద ఎత్తున రావాల్సిన దిగుబడి కూడా రాకపోవడంతో మామిడి రైతులు ఏం చేయాలో పాలుపోక కష్టాల కడలిలో నెట్టుకొస్తున్నారు.
తగ్గిన దిగుబడులు
అన్నమయ్య జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా లాల్ బహార్, బేనీషా, ఖాదర్, తోతాపురి, బెంగులూర, ఇమామ్ పసంద్, చెరుకు రసం, సువర్ణ రేఖ, దసేరి, మలుగ్బా తదితర రకాలు సాగు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంతోపాటు రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మామిడి తోటలు విస్తరించాయి. అయితే దిగుబడులు పెద్దగా లేకపోవడంతో ఈసారి జిల్లా వ్యాప్తంగా అంతంత మాత్రంగానే కాయలు కనిపిస్తున్నాయి.
మామిడి ధర అంతంతే
అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు దిగుబడి అమాంతంగా తగ్గిపోగా, మరోవైపు ధరలు పతనం కావడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. గత ఏడాది మొదటిరకం లాల్‌బహార్, బేనీషా, ఇమామ్ పసంద్ తదితర రకాలు టన్ను కాయలు రూ. 80 వేలు నుంచి రూ. లక్ష వరకు పలికాయి. ప్రస్తుతం రూ. 30–40 వేలకు పడిపోవడం చూస్తే పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది. అంతేకాకుండా మిగిలిన సాధారణ రకం కాయలైతే రూ. 10 వేలు, రూ. 15 వేలు, రూ. 20 వేలులోపు మాత్రమే పలుకుతుండడంతో మామిడి రైతుకు గిట్టుబాటు లభించని పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి మామిడి రైతుకు ఒకవైపు ప్రకృతి దెబ్బతీయగా, మరోపక్క ధరలు పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నాడు.
నా పేరు గుగ్గిళ్ల చంద్ర. మాది మండల కేంద్రమైన టి.సుండుపల్లె. నేను నాలుగు ఎకరాల్లో మామిడి వేశాను. 12 ఏళ్ల చెట్లు కావడంతో గతేడాది దిగుబడి బా గుండేది. ఈసారి పెద్దగా లేదు. నేను బేనీషా, ఖాదర్, లాల్ బహార్‌ను సాగు చేశాను. ధర చూస్తే చాలా తక్కువగా ఉండడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
తోటల్లో చెట్లకు కాయలు లేవు...
పండ్లకు ధర లేదు
వ్యాపారులు, దళారుల కుమ్మక్కుతో అంతంతమాత్రంగానే మామిడికి రేట్లు
దేశంలో పేరు ఉన్న వీరబల్లి బేనీషా టన్ను రూ. 30–35 వేలలోపే
సాధారణ రకం కాయలకు
రూ. 15,000 మాత్రమే పలుకుతున్న ధర
గతంతో పోలిస్తే ఈసారి
భారీగా పడిపోయిన మామిడి ధరలు
అన్నమయ్య జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగు
ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మామిడి సీజన్‌గా భావిస్తారు. ప్రధానంగా ఇక్కడ పండించిన మామిడి కాయలు మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, డిల్లీ తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వెళతాయి. అయితే ఢిల్లీ, హర్యాన తదితర ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో వ్యాపారులు వచ్చి రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో బస చేస్తారు. అయితే ధరలు వివిధ రాష్ట్రాల్లో కొంతమేర అధికంగా ఉన్నా కొనేందుకు వచ్చిన వ్యాపారులతో స్థానికంగా ఉన్న దళారులు మాట్లాడుకుని ధరలను శాసిస్తున్నారు. ఎక్కడికక్కడ వారు అనుకున్న ధర ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా దళారుల ద్వారానే వ్యాపారస్తులతో ధరలు మాట్లాడుకోవడంతో ఆశించిన మేర లాభాలు ఒనగూరడం లేదు. ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయని ఇతర రాష్ట్రాలకు వెళ్లి రైతులు అమ్ముకునే పరిస్థితి కూడా లేదు.

● దళారులు, వ్యాపారుల ములాఖత్

● దళారులు, వ్యాపారుల ములాఖత్

● దళారులు, వ్యాపారుల ములాఖత్

● దళారులు, వ్యాపారుల ములాఖత్