అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం పైడి కాలువ పంచాయతీ సీతోరుపల్లె గ్రామానికి చెందిన పంగా రామయ్య (21)అనే యవకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వల్లూరు మండలానికి చెందిన పంగా వీరయ్య కుమారుడు పంగా రామయ్య కూలి పనులు చేసుకొనేవాడు. అయితే నందిపల్లి గ్రామ సమీపంలో కాలిన గాయాలతో రామకృష్ణారెడ్డి అరటి తోట వద్ద పడి ఉండడంతో అరటి తోట వద్దకు పనికి వెళ్లిన లక్ష్మిదేవి అనే మహిళ చూసి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో కొన ఊపిరితో ఉన్న రామయ్యను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐలు నరసింహులు, చాంద్ బాషా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే మృతుని తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ విలేకరులతో మాట్లాడుతూ పొలం పనులకు వెళ్లిన లక్ష్మిదేవి గమనించి రైతు రామకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చిందన్నారు. ఆయనతోపాటు నందిపల్లె గ్రామస్తులు కొందరు అక్కడికి వెళ్లి కాలిన గాయాలతో పడి ఉన్న యువకుడిని విచారించగా ముందు నీళ్లు ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పినట్లు తెలిపారు. అలాగే నీళ్లు తాగి మా నాన్న పేరు వీరయ్య అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు రామయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన స్థలంలో రామయ్యపై పెట్రోల్ కాని కిరోసిన్ కాని వేసి కాల్చిన ఆనవాళ్లు కనిపించలేదని చెప్పారు. వేరే ప్రాంతంలో కాల్చి రాత్రి సమయంలో నందిపల్లె ప్రాంతానికి తీసుకొని వచ్చి పడేసినట్లు ఉందన్నారు. రామయ్యది హత్య కేసుగానే భావిస్తున్నామన్నారు. వల్లూరు మండలంలో సీతోలుపల్లె నుంచి వీఎన్ పల్లెలో ఉన్న అక్క ఇంటికి భోజనానికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి వెళ్లినట్లు తెలిసిందని చెప్పారు. సీతోలుపల్లె నుంచి వీఎన్ పల్లెకు వెళ్లలేదని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
హత్యగా భావిస్తున్న పోలీసులు
మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి


