ఫెయిల్ అయ్యామని ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయిన ముగ్గురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించి, స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని(16) పరీక్షలో గణితం సబ్జెక్టులో ఫెయిల్ అయింది. మనస్తాపంతో విష ద్రావణం తాగింది. గుర్రంకొండ మండలం నడిమికండ్రిగకు చెందిన విద్యార్థి(16) మదనపల్లెలో ఉంటూ జెడ్పీ హైస్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. నీరుగట్టువారిపల్లెకు చెందిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థి(18) పరీక్షలో ఫెయిల్ కావడంతో నిద్రమాత్రలు మింగాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మెడికల్ ఏజెన్సీలో చోరీ
కడప అర్బన్ : కడప నగరం బీకేఎం వీధిలో ఈశ్వర్ మెడికల్ ఏజెన్సీలో గుర్తుతెలియని దొంగలు జొరబడి నగదును అపహరించినట్లు కడప టూ టౌన్ ఎస్‌ఐ ఎస్‌కేఎం హుస్సేన్ తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు కడపకు చెందిన శివకుమార్ ఈనెల 11వ తేదీ రాత్రి తమ ఏజెన్సీ మూసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి ఉదయం వచ్చి చూసేసరికి తమ ఏజెన్సీ షట్టర్ పగలగొట్టి దొంగలు చొరబడి రూ.1.21 లక్షల నగదును అపహరించినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎస్‌బీఐలో చోరీ
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలంలోని కొత్త రోడ్డులోగల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనలో 30 వేల రూపాయలు నగదు, సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ బాక్స్‌ను దొంగిలించినట్లు సమాచారం. సీఐ కృష్ణారెడ్డి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కారు ఢీకొని బాలుడికి గాయాలు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని నెల్లూరు రోడ్డు నుంచి శివాలయంకు వెళ్లే రోడ్డులో ఆదివారం కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. పట్టణంలోని గౌరీశంకర్ నగర్‌కు చెందిన రాజు, క్రిష్ణవేణిల కుమారుడైన గుర్రాల వెంకటనాగేష్ (11) శివాలయం రోడ్డు నుంచి నెల్లూరు రోడ్డు వైపు వస్తుండగా ప్రొద్దుటూరు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో ఎడమ కాలు విరిగింది.


