జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
● డీఆర్‌సీలో పలు
శాఖలపై సమీక్ష
రాయచోటి : జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమన్వయంగా పని చేద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో మంత్రి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ(డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా ఎన్నో విషయాల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. పింఛన్ల పంపిణీ, పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారం, జాబ్ మేళాల నిర్వహణ, రీ సర్వే, ఎన్టీఆర్ హౌసింగ్, ఇళ్ల నిర్మాణాలు, పల్లె పండుగ పనులు, సూక్ష్మ నీటిపారుదల తదితర అంశాలలో అగ్రస్థానంలో ఉందని అన్నారు. మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే అంశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి ముందు ఉంచారని, వెంటనే స్పందించిన చంద్రబాబు రాష్ట్రమంతా దానిని అమలయ్యేలా చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. విజన్–2047లో పేర్కొన్న విధంగా అన్నమయ్య జిల్లా 15 శాతం వృద్ధిరేటుతో అభివృద్ధి పథంలో నిలుస్తుందని తెలియజేయడంలో సందేహం లేదన్నారు. జిల్లాలో పలు జాతీయ రహదారులు పనులు, మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పంచ సూత్రాలు, ఇలా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు, విద్య, వైద్యం, ఇలా అన్ని అంశాలపై రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కూలంకషంగా చర్చించి మోడల్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ జిల్లాలో టమాటా, మామిడి పంటలు ఎక్కువగా ఉన్నందున ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. హార్టికల్చర్ హబ్‌గా చేయడానికి మీ సూచనలు, సలహాలు, సహకారం కోరుతున్నామన్నారు.
సూక్ష్మనీటి పారుదలలో మూడో స్థానం
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సూక్ష్మనీటి పారదలలో అన్నమయ్య జిల్లా మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2025–26లో 15 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదలను అందించే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పర్యాటక రంగంలో అభివృద్ధి పనులకు అవసరమయ్యే భూసేకరణపై తగిన నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గ్రామీణ నీటిపారుదల, గనులు–భూగర్భ, డ్వామా, విద్య, ఐసీడీఎస్, అటవీ, పరిశ్రమలు, డీఆర్‌డీఏ, పట్టణ ప్రజారోగ్యం తదితర శాఖలపై చర్చించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, చైర్మన్ రూపానందరెడ్డి, డీఈఓ సుబ్రమణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం


