మదనపల్లె రెవెన్యూలో లంచాల జోరు
మదనపల్లె : మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచాల జోరు కొనసాగుతోంది. భూమి ఆన్‌లైన్ చేయించడం, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయడం, మ్యుటేషన్ తదితర సేవలకు సంబంధించి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా బుధవారం మండలంలోని బీకే.పల్లె పంచాయతీలో ఓ సర్వే నెంబర్‌లో మ్యుటేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో ఆ పంచాయతీకి సంబంధం లేని వీఆర్‌ఓ రూ.5లక్షలు తీసుకుని, అధికారికి మాత్రం కేవలం 20 వేలు ఇచ్చాడని, తహసీల్దార్ కార్యాలయంలో సదరు వీఆర్‌ఓ అవినీతి, అక్రమాలకు అడ్డే లేదంటూ పట్టణానికి చెందిన వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ వైరల్ అయింది. దీంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమై జరిగిన పొరపాటును దిద్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. గురువారం మెసేజ్ వైరల్ విషయమై తహసీల్దార్ కార్యాలయానికి వెళితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీకే.పల్లె పంచాయతీకి మస్తాన్, ప్రసాద్‌లు వీఆర్‌ఓలుగా ఉన్నారు. వీరి పంచాయతీలోని సర్వే నెంబర్.448లోని 5.02 ఎకరాల భూమిని భాగ పరిష్కారాల్లో భాగంగా సానక వెంకటరమణారెడ్డి, సానక నాగరాజారెడ్డి, సానక సుధాకర్‌రెడ్డిల పేరుపై మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి వారు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన సమయంలో...వేరే పంచాయతీకి చెందిన వీఆర్‌ఓ వారితో మాటలు కలిపాడు. తహసీల్దార్ కొత్తగా వచ్చారని, ఇప్పుడిప్పుడే మ్యుటేషన్లు చేయడం లేదని, మీకు అత్యవసరమైతే తాను ఎలాగోలా నచ్చజెప్పి చేయిస్తానని ఐదు లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. 15 రోజులకు ముందు ఒకరిపేరుమీద, బుధవారం రోజు మరొకరి పేరు మీద మ్యుటేషన్ జరిగింది. అయితే బీకే.పల్లె పంచాయతీకి చెందిన వీఆర్‌ఓలు తమ పరిధిలో మ్యుటేషన్‌కు తమతో సంబంధం లేకుండానే వేరే పంచాయతీకి చెందిన వీఆర్‌ఓతో చేయించుకోవడంపై రైతులను ప్రశ్నించారు. దీంతో వారు అసలు విషయం బయటపెట్టడంతో లంచం విషయం వెలుగులోకి వచ్చింది. ఇది కాస్తా ఆ నోటా ఈ నోటా పాకి గ్రూపుల వరకు చేరింది. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందిని ఎవరిని కదిలించినా, ఈ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన వీఆర్‌ఓ గతంలో పనిచేసిన తహసీల్దార్‌లను ఇలాగే వాడుకున్నాడని, ఓ తహసీల్దార్ అతడిని వద్దని సరెండర్ చేస్తే, మంత్రి వద్దకు వెళ్లి పలుకుబడి ఉపయోగించి మరీ పోస్టింగ్ తెచ్చుకున్నాడని చెప్పుకుంటున్నారు. చాలాకాలంగా మదనపల్లె మండలంలోనే పనిచేస్తూ, కోట్లకు పడగలెత్తాడని రెవెన్యూ సిబ్బంది బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
మ్యుటేషన్‌కు రూ.5లక్షలు
తీసుకున్న వీఆర్‌ఓ
అధికారికి కేవలం
రూ.20 వేలు అప్పగింత
వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్, దిద్దుబాటలో అధికారులు


