13న గురుకుల విద్యాలయాల ప్రవేశానికి పరీక్ష
రాయచోటి జగదాంబసెంటర్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి (2025–26) ఈ నెల 13న పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా గురుకులాల సమన్వయకర్త ఎ.ఉదయశ్రీ బుధవారం తెలిపారు. జిల్లాలో 11 పరీక్షా కేంద్రాల్లో 5వ తరగతిలో 880 సీట్ల కోసం 776 మంది, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 800 సీట్లకు 1,226 మంది విద్యార్థులు దరఖాస్తుల చేసుకున్నారని తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు https://apbragcet. apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్‌లో తప్పుగా ఉన్న వారు హెడ్ మాస్టర్ ధృవీకరించిన స్టడీ సర్టిఫికెట్, ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు.లేకపోతే పరీక్ష హాల్‌లోకి అనుమతి ఉండదని జిల్లా గురుకులాల సమన్వయకర్త ఉదయశ్రీ పేర్కొన్నారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
మదనపల్లె సిటీ : ఆంఽధ్ర పెన్షనర్స్ పార్టీ మదనపల్లె నూతన కార్యవర్గం ఎన్నికలు బుధవారం స్థానిక బెంగళూరు రోడ్డులోని జీఆర్‌టీ ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఎన్నికల అధికారిగా రిటై ర్డ్ ఎంఈఓ పోతబోలు రెడ్డప్ప వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా మణికంటె నారాయణ, సహాధ్యక్షుడిగా శివప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా గురునారాయణచారి, సహ కార్యదర్శిగా ఎస్.కృష్ణమూర్తి, కోశాధికారిగా రెడ్డప్ప ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ పెన్షనర్స్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో పెన్షనర్స్ పార్టీ నాయకులు మునిగోపాలకృష్ణ, రాజన్న, జగన్‌మోహన్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణాన్ని
విజయవంతం చేయండి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రతి ఒక్కరూ కార్యదీక్షతో విధులు నిర్వర్తించి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులకు ఒక్కరోజు శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన అంశాల్లో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగనుందన్నారు. సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారన్నారు. అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్న మహోత్సవంలో భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


