మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు
రాయచోటి : మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవామా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మంత్రి రాజంపేట మున్సిపాల్టీకి సీఎస్‌ఆర్ నిధులు రూ. 21 లక్షలతో కొనుగోలు చేసిన ఆరు చెత్తసేకరణ ఆటోలను జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌ల సమక్షంలో రాజంపేట మున్సిపల్ కమిషనర్‌కు అప్పగించారు. ఎంప్రాడా మినరల్స్ ఎండీ ఆకేపాటి విక్రమ్ రెడ్డి ఆర్థికసాయంతో ఈ ఆటోలను కేటాయించారు. కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు.
గృహనిర్మాణ ప్రక్రియను
వేగవంతం చేయాలి : కలెక్టర్ శ్రీధర్
జిల్లాలో గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో పేదలకు గృహనిర్మాణ పథకంలో భాగంగా జిల్లాలో చేపట్టిన గృహనిర్మాణ పురోగతిపై ఆశాఖ డీఈలు, ఏఈలు, మండల ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఆగిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లను త్వరగా పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. అర్హతగల ప్రతి లబ్ధిదారును డిజిటల్ అసిస్టెంట్ లాగిన్‌లో నమోదు చేయాలని సూచించారు. గృహ నిర్మాణశాఖ జిల్లా అధికారి శివయ్య తదితరులు పాల్గొన్నారు.


