రైల్వేకోడూరు : వైఎస్సార్‌ ఉద్యానకళాశాల.. విద్యావనం..అభివృద్ధి ఘనం

- - Sakshi

రైల్వేకోడూరు వైఎస్సార్‌ ఉద్యానకళాశాలకు ప్రత్యేక స్థానం

రూ 14.59 కోట్లతో నూతన భవనాలు

ఓబులవారిపల్లె: రాయలసీమలోనే ఉద్యాన పంటలకు పేరుగాంచిన రైల్వేకోడూరు అనంతరాజుపేటలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఉద్యాన కళాశాల అభివృద్ధి పథంలో దూసుకెళుతుంది. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2007లో ఉద్యాన కళాశాలను ఏర్పాటు చేశారు. పండ్లతోటల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తోంది.

కళాశాల ఏర్పాటు చేసిన 15 సంవత్సరాల్లో ఎంతో పురోగతిని సాధించింది. తాజాగా శుక్రవారం కళాశాల ఆవరణలో దాదాపు 14.59 కోట్ల రూపాయలతో నిర్మించిన అకడమిక్‌ బ్లాక్‌ ( ముడోదశ), బాలుర, బాలికల వసతిగృహం , పీజీ విద్యార్థుల వసతి గృహం( రెండో దశ )భవనాలతో పాటు వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) పరిపాలన భవనాలను శుక్రవారం వ్యవశాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జఖియా ఖానం, ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, వీసీ డాక్టర్‌ టీ జానకిరామ్‌ ప్రారంభించనున్నారు.

ఘన చరిత్ర కలిగిన ఉద్యాన కళాశాల

రైల్వేకోడూరు అనంతరాజుపేటలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం ఘనచరిత్ర కలిగి ఉంది. అప్పట్లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ సమయంలో 1935న పండ్ల పరిశోధన స్థానం పేరిట ఏర్పాటు చేశారు. 1935 మార్చి 1న స్థలాన్ని కేటాయించారు, డాక్టర్‌ కేసీ నాయక్‌ ఈ పరిశోధన స్థానం తొలి సూపరింటెండ్‌గా ఆగస్టు 3 నుంచి బాధ్యతలు చేపట్టారు. ఆగష్టు 4 నుంచి పనిచేయడం ప్రారంభమైంది. డిసెంబర్‌ 12న అధికారికంగా ప్రారంభించారు.

దేశంలో సబూర్‌ ( బీహార్‌), కృష్ణగిరి ( పశ్చిమ బెంగాల్‌)లతో కలిసి మామిడి పరిశోధన స్థానంగా కొనసాగింది. 1960లో దేశంలోనే 8వ పండ్ల పరిశోధన స్థానంగా ఈ సంస్థను భారత వ్యవసాయ పరిశోధన మండలి( ఐకార్‌) గుర్తించింది. ఉష్ణమండల పండ్ల ఉత్పత్తి పెంపు, పండ్లతోటల్లో తెగుళ్ల నివారణ ప్రధాన లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తోంది.

125 ఎకరాల్లో ఏర్పాటు

125 ఏకరాల్లో చైన్నె–హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన ఏర్పటు చేశారు. దక్షిణ మండల వ్యవసాయవాతవరణ స్థితిలో ఈ ప్రాంతం ఉంది. ఉద్యాన పంటల అభివృద్ధికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడంలో అంకితమై పనిచేస్తోంది.బీఎస్సీ ఉద్యానకోర్సులు 2007–08లో, 2011–12 విద్యాసంవత్సరం నుంచి పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ప్రారంభమయ్యాయి. 7 విభాగాల్లో పీజీ, 5 విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తున్నారు.

నిపుణులైన 8 మంది ప్రొఫెసర్లు, 9 మంది అసోసియేట్‌, 21 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. 11 మంది సహాయ, 36 మంది సాంకేతిక, 35 మంది ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కళాశాలలో అనేక వసతులతో పాటు ఆధునిక ప్రయోగశాలలు ఉన్నాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌లతో పాటు అనేక అంశాల్లో రాష్ట్ర , జాతీయ స్థాయి పతకాలు సాధిస్తున్నారు.

మరిన్ని వసతులు కావాలి

కళాశాల ఏర్పాటు చేసిన తక్కవ కాలంలో పురోగతి సాధించింది. ఈ ఏడాది 8 రాష్ట్రాల నుంచి విద్యార్థులు జాతీయ స్థాయిలో అడ్మిషన్‌ పొందారు. భవిష్యత్‌లో కళాశాలకు మరిన్ని వసతులు అ వసరం. అంతర్జాతీయ విద్యార్థుల కోసం వసతి గృహం, ఏర్పాటు కావాల్సి ఉంది. ఉన్న సౌకర్యాలు మెరగుపరచుకుంటూ మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. – డాక్టర్‌ కే.గోపాల్‌, అసోసియేట్‌ డీన్‌, ఉద్యాన కళాశాల

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top