
తమపై విజయవాడలో పోలీసులు వ్యవహరించిన తీరును వివరించిన విద్యార్థులు
విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన జగన్
గత రాత్రి పోలీసులు దాడిచేయడం దారుణమన్న జగన్
న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ
సాక్షి, తాడేపల్లి: ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వంలో ఎవ్వరికీ భరోసా లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తిచేసుకుని, ఈ ప్రభుత్వ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వక ఇబ్బందిపడుతున్న విద్యార్థులు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర, పలువురు యువ వైద్యులు ఉన్నారు. గత రాత్రి పోలీసుల దాడి వివరాలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు. తమ ఆందోళనకు కారణాలను వైఎస్ జగన్‌కు విద్యార్థులు వివరించారు.
ఇక్కడ మెడికల్ సీట్లు రాకపోవడంతో తమ తల్లిదండ్రులు ఎన్నో కష్ట నష్టాలకోర్చి, అప్పులు చేసి మరీ తమను విదేశాలకు పంపించారని, తాము కూడా కష్టపడి మెడికల్ కోర్సులు పూర్తిచేశామని, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్ష, ఇంటర్న్‌షిప్ అన్ని చేసినా తమకు పీఆర్ నంబర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎఫ్‌ఎంజీ చేసిన మరి కొంతమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం లేదని, గడువుకు మించి ఇంటర్న్‌షిప్ పేరిట గొడ్డుచాకిరీ చేయించుకురన్నారని తెలిపారు. చదువులు పట్ల, విద్యార్థుల పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందని, మరో వైపు తమ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని అత్యంత బలోపేతం చేస్తే ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.
ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చి, మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచేలా చర్యలు తీసుకున్నామని, ఐదు కాలేజీలు కూడా ప్రారంభించామని, కాని ఈ ప్రభుత్వం మిగిలిన వాటిని అడ్డుకుని, పైగా కేంద్రం ఇచ్చిన సీట్లను కూడా తిప్పిపంపిందన్నారు. మెడికల్ సీట్లు ఇస్తే, వద్దని తిప్పి పంపిన దేశంలో ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనని అన్నారు. విద్యార్థుల సమస్యలపై మాజీ సీఎం ఆవేదన వ్యక్తంచేస్తూ వారి పోరాటాలకు సంఘీభావాన్ని వ్యక్తంచేశారు. ప్రభుత్వం దృష్టిపెట్టి, ఈ సమస్యలను పరిష్కరించేంతవరకూ అండగా ఉంటామన్నారు.