సిక్కోలు చిన్నోడు ‘హర్డిల్స్‌’లో దూకుడు

Yashwanth amazing performance in 110 meter hurdles - Sakshi

పేదరికం అడ్డుగోడలను అధిగ మించి అంతర్జాతీయ ట్రాక్‌ వైపు 

110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్‌ అద్భుత ప్రదర్శన

జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్‌ విభాగాల్లో సత్తా

ఏషియన్, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అర్హతకు కఠోర శిక్షణ 

సాక్షి, అమరావతి: పేదరికం అడ్డుగోడలను అధిగమించి సిక్కోలు చిన్నోడు చిన్ననాటి నుంచే ‘హర్డిల్స్‌’లో అదరగొడుతున్నాడు. గొప్ప అథ్లెట్‌ కావాలన్న ఆకాంక్షతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను ఒడిసిపడుతున్నాడు. లావేటి యశ్వంత్‌ కుమార్‌ (20) రెండేళ్ల వ్యవధిలో 13 జాతీయ పతకాలను సాధించి క్రీడాలోకం దృష్టిని ఆకర్షించి మెరుపు వేగంతో అంతర్జాతీయ ట్రాక్‌వైపు దూసుకెళ్తున్నాడు. 

సీనియర్లతో తలపడి మరీ..
విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామానికి (పాత శ్రీకాకుళం జిల్లా) చెందిన యశ్వంత్‌ కుమార్‌ హర్డిల్స్‌ 110 మీటర్ల విభాగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. వాలీబాల్‌ క్రీడాకారుడైన తండ్రి సూరంనాయుడు ప్రోత్సాహంతో క్రీడల్లో అడుగుపెట్టాడు. గతేడాది గౌహతిలో జరిగిన 36వ జూనియర్‌ నేషనల్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా లక్ష్యాన్ని 13.92 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. సీనియర్‌ విభాగాల్లో సైతం పోటీపడి పతకాలు సాధించడం గమనార్హం. పాటియాలా సీనియర్‌ ఫెడరేషన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో కాంస్యం, ఢిల్లీలో అండర్‌–23 అథ్లెటిక్స్‌ మీట్‌లో రజతం, వరంగల్‌ సీనియర్‌ ఓపెన్‌ ఈవెంట్‌లో 5వ స్థానంతో సత్తా చాటాడు. ఈ ఏడాది సీనియర్‌ విభాగంలోకి అడుగిడిన యశ్వంత్‌ ఫిబ్రవరిలో మంగుళూరులో జరిగిన ఇంటర్‌ వర్సిటీ పోటీల్లో ఆచార్య నాగార్జున వర్సిటీ తరఫున 110 మీటర్ల లక్ష్యాన్ని 14.32 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణంతో మెరిశాడు. 
కసరత్తు చేస్తున్న యశ్వంత్‌ కుమార్‌ 

రెండేళ్లుగా బళ్లారిలో శిక్షణ
యశ్వంత్‌ రెండేళ్లుగా బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన ఇన్‌స్పైర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సిడ్నీ ఒలింపిక్‌ హర్డిల్స్‌ స్వర్ణ పతక విజేత మాజీ అథ్లెట్‌ అనియర్‌ గార్సియా పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్‌ ఉత్తమ టైమింగ్‌ 14.10 సెకన్లుగా ఉంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాలంటే 13.62 సెకన్లు, ఒలింపిక్స్‌కు 13.32 సెకన్లు (పోటీల్లో విజేతల ప్రతిభను బట్టి ఈ సమయం మారుతుంటుంది) వేగం ఉండాలి. అండర్‌ 16, 18, జూనియర్, సీనియర్‌ హర్డిల్స్‌ ఎత్తులో వ్యత్యాసం ఉండటం, జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్‌ పోటీల్లో పాల్గొన్న అనుభవం యశ్వంత్‌కు అంతర్జాతీయ పోటీల్లో సులభంగా అర్హత సాధించేందుకు దోహదపడనుంది. రెండేళ్ల క్రితమే సీనియర్‌ ఏషియన్‌ ఇండోర్, జూనియర్‌ ఏషియా, జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు అర్హత సాధించినప్పటికీ కరోనా అడ్డుతగిలింది. 

ఏషియన్, కామన్‌వెల్త్‌కు సిద్ధం..
ప్రస్తుతం సీనియర్‌లో విభాగంలో సిద్ధాంత్‌ తింగాలియ పేరుతో ఉన్న రికార్డు (13.48 సెకన్లు) బద్ధలుగొట్టి అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందేలా యశ్వంత్‌ సిద్ధమవుతున్నాడు. ఈ నెల 29న కర్నాటకలో జరిగే ఖేలో వర్సిటీ పోటీల ద్వారా వరల్డ్‌ వర్సిటీ పోటీలకు, జూన్‌లో ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌ షిప్‌ ద్వారా కామన్‌ వెల్త్, ఏషియన్‌ గేమ్స్‌లో అడుగుపెట్టేలా టెక్నిక్‌పై దృష్టి సారించాడు. 

స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి...
యశ్వంత్‌ హైదరాబాద్‌  హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో నాలుగో తరగతి నుంచి తొమ్మిది వరకు చదివాడు. అనంతరం గోల్కొండలోని బాయ్స్‌ స్పోర్ట్స్‌ కోమ్‌ (ఆర్మీ ఆర్టీ సెంటర్‌ సెలక్షన్‌లో ఎంపికై) సీబీఎస్సీలో టెన్త్‌ పూర్తి చేశాడు. ఇంటర్‌ దూరవిద్యలో పూర్తైంది. తరువాత గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని టెన్విక్‌ అకాడమీలో (అనిల్‌ కుంబ్లే అకాడమీ) అంతర్జాతీయ శిక్షకుడు అద్రిమామ్‌(దక్షిణాఫ్రికా), ఎరిక్‌ డిక్సన్‌ (అమెరికా) వద్ద ఏడాది పాటు శిక్షణ పొందాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో డిగ్రీ ఫైనలియర్‌ బీకాం చదువుతున్నాడు. 

కుటుంబ నేపథ్యం..
యశ్వంత్‌ తండ్రి సూరంనాయుడు హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నేషనల్‌ వాలీబాల్, త్రోబాల్‌ రిఫరీగా ఉన్న ఆయనకు ఇద్దరు కుమారులు. వారి భవిష్యత్తు కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చేశారు. చిన్న కుమారుడు సిద్ధ వరప్రసాద్‌ జిమ్నాస్టిక్‌ క్రీడాకారుడు. ట్రైనింగ్‌ సెంటర్‌లో భోజన, వసతి సౌకర్యాలను మాత్రమే సమకూరుస్తారు. కుమారుల ప్రాక్టీస్‌ కోసం అవసరమైన షూలు, పౌష్టికాహారం, దుస్తుల కోసం నెలకు దాదాపు ఇద్దరు రూ.10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సొంత గ్రామంలో చిన్న ఇల్లు మినహా ఆ కుటుంబానికి వేరే ఆస్తులు లేవు.

110 మీటర్ల హర్డిల్స్‌లో విజయాలు..
► 32వ సౌత్‌ జోన్‌ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌–2021లో స్వర్ణం
► ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 2020లో  స్వర్ణంతో పాటు 14.10 సెకన్లలో లక్ష్యం పూర్తి చేసి కొత్త రికార్డు 
► 35వ జూనియర్‌ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో సిల్వర్‌ మెడల్‌
► 31వ సౌత్‌ జోన్‌ జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌–2019లో స్వర్ణం
► గుంటూరు జాతీయ జూనియర్‌–2019 పోటీల్లో ద్వితీయ స్థానం
► 17వ ఫెడరేషన్‌ కప్‌ నేషనల్‌ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ షిప్‌–2019 రిలేలో (4  గీ 100) కాంస్యం.
► సౌత్‌జోన్‌ జాతీయ పోటీలు–2018లో 100 మీటర్ల మిడే రిలేలో స్వర్ణం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం
► 2016లో విశాఖలో జరిగిన అంతర్‌ జిల్లాల జాతీయ పోటీల్లో కాంస్యం

సాయం కావాలి..
రోజుకు ఒక సెషన్‌ చొప్పున వారంలో ఆరు సెషన్లు శిక్షణ ఉంటుంది. జిమ్, ట్రాక్‌పై కఠినంగా శ్రమించాలి. ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ సెలవు రోజు కూడా ప్రాక్టీస్‌ చేస్తున్నా. నా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లోనూ లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రోత్సాహకాలు దక్కలేదు. ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నా.
– లావేటి యశ్వంత్‌ కుమార్, అథ్లెటిక్స్‌ క్రీడాకారుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top