‘సంధ్యారాణిని  వెంటనే డిశ్చార్జ్‌ చేయండి’ 

Womena activist Kathi padma demands  to Release Sandhya Rani Andhra Pradesh - Sakshi

అల్లిపురం(విశాఖ దక్షిణ): రక్షణ కల్పించాలని ఆశ్రయించిన ఓ వివాహితపై పెందుర్తి పోలీసులు మానసిక రోగిగా ముద్రవేసి అక్రమంగా మెంటల్‌ హాస్పిటల్‌కు తరలించారని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ ఆరోపించారు. బాధితురాలిని తక్షణమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం డాబాగార్డెన్స్‌ వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. పెందుర్తికి చెందిన మోసూరి సంధ్యారాణి.. తన భర్త మోసూరి రవికృష్ణ తనను, తన పిల్లలను శారీరకంగాను, మానసికంగానూ వేధిస్తున్నాడని, తనకు రక్షణ కల్పించాలని ఈ నెల 6న ఎండాడ దిశ పోలీస్‌ స్టేషన్‌లో స్వయంగా ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులు, అన్నదమ్ములకు చెప్పినా.. తన భర్తకే వత్తాసు పలుకుతున్నారని వాపోయింది. అదే రోజు ఆమె కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో సంధ్యారాణి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు.


మెంటల్‌ హాస్పిటల్‌లో బాధితురాలు సంధ్యారాణి

7న పెందుర్తి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా.. వారు రక్షణ కల్పించాల్సింది పోయి ఆమె భర్త, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేజీçహెచ్‌కు తరలించారు. అక్కడ నుంచి నేరుగా చినవాల్తేరు మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. రక్షణ కల్పించాలని కోరిన ఆరోగ్యవంతురాలైన సంధ్యారాణిని మెంటల్‌ హెల్త్‌ చట్టం 1987(రద్దయిన చట్టం)ను షాకుగా చూపి మెంటల్‌ హాస్పిటల్‌కు తరలించడం ఆమె హక్కులను ఉల్లంఘించటమేనని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తక్షణమే బాధితురాలిని విడుదల చేసి, ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ను బహిర్గతం చేయాలని కత్తి పద్మ డిమాండ్‌ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన పెందుర్తి పోలీసులపై చర్యలు తీసుకుని, సంధ్యారాణికి వసతి, రక్షణ కల్పించాలని మహిళా సంఘాల నేతలు కోరారు.  

మేలు చేయాలన్నదే పోలీసుల ప్రయత్నం 
పెందుర్తి: స్థానిక సుజాతనగర్‌కు చెందిన మోసురి సంధ్యారాణి, ఆమె పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే పెందుర్తి పోలీసులు పనిచేశారని సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు. ఆమెకు మేలు చేయాలన్నదే తమ ప్రయత్నమన్నారు. తమకు సంధ్యారాణి తల్లిదండ్రులు, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి కేజీహెచ్‌లోని వన్‌ స్టాప్‌ సెంటర్‌కు పంపించామన్నారు. ఆమె మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని మెంటల్‌ హెల్త్‌కేర్‌ యాక్ట్‌ ప్రకారం నిపుణులైన వైద్యుల నివేదిక మేరకు మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకే సంధ్యారాణిని సంబంధిత వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఈ కేసులో పోలీసులు కేవలం మానవతా దృక్పథంతోనే ఆలోచించారే తప్ప మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ కేసులో తాము పూర్తిగా న్యాయబద్ధంగా.. పారదర్శకంగా వ్యవహరించామని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top