
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్రం అసహనం
వడ్డీతోసహా తక్షణం జమచేయాలని ఆదేశం
ఎనిమిది నెలల క్రితం రూ. 1,121 కోట్ల గ్రాంట్లు
ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయని వైనం
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో గ్రాంట్లుగా ఇచి్చన రూ. 1,121.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం నుంచి నిధులు అందిన 10 పని దినాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ ఎందుకు జమ చేయలేదో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ వస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.
ఫిర్యాదుల నేపథ్యం..
‘ఈ – గ్రామ్ స్వరాజ్ పోర్టల్’లో నిధుల బదిలీ జరిగినట్లు కనిపించకపోవడంతో పాటు పలు సర్పంచ్ సంఘాలు ఈ అంశంపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం స్పందించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రాంప్రతాప్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ.. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా సంబంధిత గ్రాంట్లను వడ్డీతో సహా తక్షణమే విడుదల చేయాలని సూచించారు. ఇందుకు రుజువుగా గ్రాంట్ ట్రాన్స్‌ఫర్ సరి్టఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని కూడా ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాగా, కేంద్రం లేఖ రాసి దాదాపు 20 రోజులు పూర్తవుతున్నప్పటికీ, ఈ నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం గమనార్హం.
కేంద్రం నిధుల విడుదల ఇలా..
⇒ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల పేరిట కేంద్రం గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన రూ. 446.48 కోట్ల బేసిక్ (అన్‌టైడ్) కేటగిరిలోనూ, అదే నెల మూడో వారంలో మరో రూ. 674.72 కోట్లు టైడ్ కేటగిరిలోనూ రాష్ట్ర ఆర్థిక శాఖకు విడుదల చేసింది.
⇒ ఆ నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం చొప్పున లెక్కకట్టి సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది.
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనా ఆక్షేపణ
రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు జరగాల్సిన చెల్లింపుల వాటాపైనా సంబంధిత లేఖలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించడం గమనార్హం. 4వ రాష్ట్ర ఆర్థిక సంఘం కాలపరిమితి 2024–25 ఆర్థిక సంవత్సరంతో పూర్తయినా తదుపరి ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం 2023 మార్చిలోనే ఏర్పాటు అయినప్పటికీ, దాని నివేదికను రాష్ట్ర శాసనసభలో సమర్పించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశి్నంచింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదిక వివరాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రం దృష్టికి తీసుకురావాలని ఆ లేఖలో ఆదేశించింది.
సాక్షి ఎఫెక్ట్‌తో... ఏప్రిల్‌లో జీవోలు
ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో నిధులను విడుదల చేస్తున్నట్టు చెప్పుకోవడానికి అదే ఏప్రిల్ నెల 25వ తేదీన పంచాయతీరాజ్ శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వోలు) పేరుతో రెండు జీవోలను విడుదల చేసింది. వాటి అమలు మాత్రం లేదు.