Drumstick: లాభాల్లో ‘మునగంగా’..

West Godavari: Drumstick Cultivation 2000 Acres Rs 40000 Income Annum - Sakshi

ఒక్కసారి నాటితే నాలుగేళ్లు ఫలసాయం

పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

ఎకరాకు ఏడాదికి రూ.40 వేల వరకు రాబడి

‘పశ్చిమ’లో 2 వేల ఎకరాల్లో సాగు

పెరవలి (పశ్చిమగోదావరి): మునగ సాగు రైతులకు కల్పతరువుగా మారింది. ఒకప్పుడు పెరటి పంటగా ఉండే మునగ నేడు వాణిజ్య పంటగా రూపాంతం చెందింది. దేశవాళీ రకాలు సీజన్‌లో మాత్రమే కాపు కాస్తుండగా.. హైబ్రీడ్‌ రకాలు ఏడాది పొడవునా దిగుబడి ఇస్తున్నాయి. ఖర్చు తక్కువ ఉండటం, నిత్యం ఆదాయం వస్తుండటంతో రైతులు మునగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవాళీ రకాల కంటే హైబ్రీడ్‌ రకాలు అధిక దిగుబడితో పాటు ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఎకరాకు రైతుకు ఖర్చులు పోను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. కాండం ద్వారా వ్యాప్తి చెందే మునగ చెట్లు నాలుగేళ్ల పాటు దిగుబడిని ఇస్తాయి.

పశ్చిమలో సాగు ఇలా..
జిల్లాలో మునగ సాగు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఇక్కడ పంట స్థానిక అవసరాలతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. తాడేపల్లిగూడెం, కొవ్వూరు, పెదవేగి, నల్లజర్ల, పోలవరం, చాగల్లు, దేవరపల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పెదపాడు, ద్వారకాతిరుమల, పెరవలి మండల్లాలో మునగ సాగు ఎక్కువగా ఉంది. 

ఆరునెలల నుంచి దిగుబడి
మునగ పంట వేసిన ఆరునెలల నుంచి దిగుబడి మొదలవుతుంది. తొలి ఏడాది చెట్టుకు 150 కాయలు దిగుబడి వస్తే, రెండో ఏడాది నుంచి దిగుబడి బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు 300 నుంచి 500 కాయలు దిగుబడి వస్తాయి. ఇలా నాలుగేళ్లపాటు ఫలసాయం ఉంటుంది. 

రూ.20 వేల వరకు పెట్టుబడి
మునగ సాగుకు పెట్టుబడి బాగా స్వల్పం. ఎరువులు, పురుగు మందులు వాడితే సరిపోతుంది. కాండం ద్వారా పలవర్ధనం చేసి మొక్కలను పెంచుతారు. పంటను గొంగలి పురుగు, కాయతొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తాయి. వీటిని నివారిస్తే సరిపోతుంది. ఎకరాకు ఏడాదికి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుంది. 

రోజూ మార్కెట్‌
మునగకు రోజూ మార్కెట్‌ ఉంటుంది. ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.50 ధర పలుకుతోంది. కిలోకు కాయ సైజును బట్టి 10 నుంచి 15 వరకు తూగుతాయి.  

100 కిలోల వరకు..
ఏడాది పొడవునా కాపు ఉండటంతో ఎకరాకు రోజుకు 30 కిలోల నుంచి 100 కిలోల వరకు దిగుబడి వస్తుంది. రైతుకు రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుండగా కోత, రవాణా, ఎరువులకు పోను రూ.1,000 నుంచి రూ.1,500 వరకు మిగులుతుంది.

నాలుగేళ్లపాటు..
మునగ వేసి ఆరు నెలలు అయ్యింది. ప్రస్తుతం కాపు కొద్దిగా ఉండటంతో దిగుబడి అంతంత మాత్రంగా ఉంది. ప్రస్తుతానికి వస్తున్న ఆదాయం పెట్టుబడికి సరిపోతోంది. రెండో ఏడాది నుంచి మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. నాలుగేళ్ల పాటు ఫలసాయం పొందవచ్చు.
 –కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు

ఏడాది పొడవునా.. 
వాణిజ్య పంటలకు దీటుగా మునగ పంటకు ఆదాయం వస్తోంది. ఏడాది పొడవునా ఫలసాయం పొందవచ్చు. గతంలో వాణిజ్య పంటలు వేసి నష్టాలు చవిచూస్తే నేడు లాభాలు పొందుతున్నాను. ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు మిగులుతోంది.
–ఉమ్మిడి రాముడు, రైతు, ఉమ్మిడివారిపాలెం

సాగు పెరిగింది
హైబ్రీడ్‌ రకాలతో ఏడాది పొడవునా ఫలసాయం పొందవచ్చు. ఇటీవల మునగ సాగు బాగా పెరిగింది. దీంతో ఎగుమతి కూడా అవుతున్నాయి. గొంగలి పురుగు, కాయతొలుచు పురుగు మాత్రమే పంటకు నష్టం కలిగిస్తాయి వీటిని అరికడితే మంచి ఆదాయం పొందవచ్చు. 
–ఎ.దుర్గేష్‌, ఉద్యాన శాఖ ఏడీఏ, తణుకు

చదవండి: పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top