టార్గెట్‌ 2024: గ్రామ సర్పంచ్‌ నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు.. ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు

We will work towards victory of YSRCP in 2024 General elections: Parikshit raju - Sakshi

రానున్న సాధారణ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ సీపీ విజయమే లక్ష్యం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరం

పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తురాజు  

సాక్షి, విజయనగరం: రానున్న 2024 సాధారణ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ నూతన అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్తురాజు స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మక అవసరమన్నారు. పార్టీ పెద్దలు, సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేల సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.

ఆయన తొలుత 2012–17 మధ్యకాలంలో చినమేరంగి గ్రామ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. తర్వాత పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

అరకు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ పార్టీ బాధ్యుడిగా గత ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించాను. పారీ్టపరంగా ఆయా నియోజకవర్గాల్లో పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు వాటిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటైంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గతం కన్నా ఇప్పుడు ప్రాంత విస్తీర్ణం తగ్గింది. ప్రతిబంధకాలు అంతగా ఉండవు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బడలిక తగ్గుతుంది. తద్వారా పార్టీ బాధ్యతలపై మరింతగా దృష్టి పెట్టడానికి అవకాశం కలిగింది. 

జగనన్న ఆశయాలకు అనుగుణంగా... 
పార్టీ అధిష్టానం నాకు పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతలు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి జగనన్న ఆశయాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేయడమే ఏకైక లక్ష్యం. ఇక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలనేదీ జిల్లా అధ్యక్షులతో జరిగే సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఆ ప్రకారం జిల్లాలో పార్టీని విజయపథంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. 

పార్టీ పెద్దలు, నాయకుల సహకారంతో... 
పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరోసారి వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా పని చేస్తాను. అత్యంత సీనియర్‌ నాయకులైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌గా ఉండటం మా అదృష్టం. ఆయన సూచనలు, సహకారంతో మంచి ఫలితాలు తీసుకొస్తాననే నమ్మకం ఉంది. జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు సహకారంతో పార్టీని మరింత పటిష్టం చేయడానికి బాధ్యత తీసుకుంటాను.  

ఎక్కడ అవసరమైతే అక్కడ సేవలు  
ప్రస్తుతం సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ.. ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారంతా తమ తమ పరిధుల్లో పార్టీ పటిష్టతకు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.  లబ్ధిదారుల నుంచి సానుకూలత ఉంది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పార్టీ విజయపతాకం ఎగురవేస్తుందనడంలో సందేహం లేదు. ఇక విజయ ఢంకా మోగించడమే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top