Uppada Fishing Harbour: Uppada Port Construction Work Is Progressing Rapidly - Sakshi
Sakshi News home page

Uppada Fishing Harbour: మినీ పోర్టులా ఉప్పాడ!

Published Mon, Jun 19 2023 4:42 AM

Uppada Port construction work is progressing  - Sakshi

(ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి  సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్‌ మైలవరపు): ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.361 కోట్లతో భారీ ఫిషింగ్‌ హార్బర్‌ను వేగవంతంగా నిర్మిస్తుండటం పట్ల స్థానిక మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులు కనుల ముందు కనిపిస్తు­న్నాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రానుండటంతో మత్స్య­కార కుటుంబాల్లో సంతోషం అంతా ఇంతా కాదు. ఇకపై తమ కష్టం వృథా కాదన్న ధీమా ఏర్పడిందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో కాకినాడ వద్ద అత్యంత విలువైన ట్యూనా, సొర వంటి చేపలు ఉన్నా.. సరైన వస­తులు లేకపోవడంతో మత్స్యకారులు ఆ అవకా­శాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. నడి సము­ద్రంలోకి వెళ్లి పది రోజుల వరకు ఉండి చేపలు పట్టుకునే భారీ స్థాయి బోట్లను నిలుపుకునే చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ రాష్ట్రంలోనే భారీ ఫిషింగ్‌ హర్బర్‌ను ఉప్పాడ వద్ద నిర్మిస్తోంది.

మిగిలిన హార్బర్లలో సముద్రం నుంచి లోతైన కాలువను తవ్వి అక్కడ బోట్లు నిలుపుకోవడానికి జెట్టీలను నిర్మిస్తుంటే.. ఉప్పాడ వద్ద మాత్రం పోర్టు మాదిరిగానే సముద్ర ఒడ్డుకు ఆనుకునే బోట్లను నిలుపుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ను ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ బ్రేక్‌ వాటర్‌ పనులు పూర్తి స్థాయిలో పూర్తవగా.. డ్రెడ్జింగ్‌ పనులు, ఒడ్డున బిల్డింగ్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

2,500 బోట్లు నిలుపుకునేలా..
♦  రెండ్రోజుల నుంచి 10 రోజుల వరకు ఏకబిగిన వేట కొనసాగించే విధంగా వివిధ పరిమాణాల బోట్లను నిలుపుకునేందుకు అనువుగా ఈ హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. 
♦  సుమారు 2,500 బోట్లను నిలుపుకునేలా జెట్టీని నిర్మిస్తున్నారు. 
♦  దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ హార్బర్‌లో ఫిషింగ్‌ హ్యాండ్లింగ్, వేలం కేంద్రం, పది టన్నుల ఐస్‌ ప్లాంట్, 20 టన్నుల శీతల గిడ్డంగి, పరిపాలన కార్యాలయాలతో పాటు ట్యూనా చేపల కోసం ప్రత్యేకంగా ట్యూనా ఫిష్‌ హ్యాండ్లింగ్, ప్యాకింగ్‌ హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 
♦  ట్యూనా చేపలు పట్టుకునేందుకు వీలుగా తొమ్మిది మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు ఉండే లాంగ్‌లైన్‌ బోట్లను ఇక్కడ నిలుపుకునే అవకాశముంది. 
♦  ఈ ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా ఏటా రూ.859 కోట్ల విలువైన 1,10,600 టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారుల అంచనా. 17,700 మందికి ఉపాధి లభించనుంది.

పది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం 
రాష్ట్రంలోని మత్యకారులు వేట కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లకుండా స్థానికంగానే చేపలు పట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏక కాలంలో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్లయిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం.

సుమారు రూ.3,500 కోట్లకు పైగా నిధులతో 60,858 మత్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వీటిని నిర్మిస్తున్నాం. మినీ  పోర్టు తరహాలో వీటి నిర్మాణం చేపట్టడమే కాక వీటిపక్కనే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
– ప్రవీణ్‌కుమార్, సీఈఓ, ఏపీ మారిటైమ్‌ బోర్డు

త్వరలో మంచి రోజులు
ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల నిలుపుకునేందుకు నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు.

బోట్లు నిలుపుకోవడం దగ్గర నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాలకు చెందిన 50,000 మత్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్‌ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.
– ఎన్‌. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్‌

గతంలో ఎంతటి భారీ చేప తీసు­కొచ్చినా పొద్దున రూ.1,000 ధర 
ఉంటే సాయంత్రం రూ.500కు పడిపోయేది. దీంతో బాగా నష్ట­పోయే వాళ్లం. ఇప్పుడు ఈ హార్బర్‌ రావడం.. ఇక్కడ శీతల గిడ్డంగులు ఉండటంతో ఆ భయం ఉండదిక. నచ్చిన ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.

గతంలో హార్బర్‌ లేకపోవడం వల్ల పోటు సమయంలో బోటు నిలుపు­కోవడానికి కష్టంగా ఉండేది. సరుకు దింపే సమయంలో ప్రమాదాలు జరిగేవి. మనుషులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా భయాలు మాకు ఉండవు. సునామీ వచ్చినా మా పడవలు భద్రంగా నిలుపుకోవచ్చు.
ఉమ్మడి యోహాను, మత్స్యకారుడు, ఉప్పాడ

Advertisement

తప్పక చదవండి

Advertisement