AP Tourist Spot: టూరిస్ట్‌ స్పాట్‌గా ఉబ్బలమడుగు.. బ్రిటిష్‌ కాలంలో ఎంతో ఫేమస్‌

Umbalamadugu Is The tourist Destination At Kombakam Reserve Forest - Sakshi

వరదయ్యపాళెం: స్వచ్ఛమైన నీరు, గాలి, పచ్చటి అడవి.. పక్షుల కిలకిలారావాలు, కొండ కోనల్లోంచి నిరంతరం ప్రవహించే సెలయేరు... జలపాతం, చుట్టూ ఎతైన కొండలు... ఇలా  ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉబ్బలమడుగు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తోంది. అటవీశాఖ ఎకో టూరిజం అభివృద్ధి పనులతో ఉబ్బలమడుగు వేసవి విడిది ప్రదేశంగా కొత్త అందాలను దిద్దుకుంటోంది. వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల సరిహద్దుల్లో కాంబాకం రిజర్వు ఫారెస్టులో ఉబ్బలమడుగు వరదయ్యపాళెం నుంచి 10కిలోమీటర్లు దూరంలో ఉంది. ఒకరోజు విహారయాత్రకు ఇది చక్కటి ప్రదేశం. 


ఆహ్లాదం, విజ్ఞానం 
పర్యాటకులకు ఆహ్లాదం పంచడంతోపాటు విజ్ఞానం అందించే దిశగా అటవీశాఖ చెట్లు, వాటి శాస్త్రీయ నామం, పుట్టుక లాంటి విశేషాలను దారి పొడవునా పేర్లతో సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. రాజులు వాడిన ఫిరంగి, టన్ను బరువు ఉన్న తిరగలి, పూసలదిబ్బ, ఎలిజబిత్‌ రాణి బంగ్లా, పాలేగాళ్లు, వారి తోటలు.. ఇలా అన్నింటినీ పర్యాటకులు చూడదగినవే. 
చూడాల్సిన ప్రాంతాలు 
వరదయ్యపాళెం నుంచి 7కి.మీ ప్రయాణిస్తే అవంతి ఫ్యాక్టరీ వస్తుంది. ఈ ఫ్యాక్టరీని దాటితే రిజర్వు ఫారెస్టు మెుదలవుతుంది. ఫారెస్టు మెుదట్లో తెలుగుగంగ కాలువ, టోల్‌ గేట్‌ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సుమారు 12 కి.మీలలో సెలయేరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. దీని పక్కన వరుసగా తంతి పందిరి, దొరమడుగు, సీతలమడుగు, తంగశాల, పెద్దక్కమడుగు, ఉబ్బలమడుగు, సిద్ధేశ్వరగుడి, సద్దికూటి మడుగు, అంజూరగంగ, దోగుడుబండ జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సీతాళం అని పిలుస్తారు. సిద్ధేశ్వరగుడి నుంచి 3 కిలోమీటర్లు కొండపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో పర్యాటకులు ఉబ్బలమడుగుకే పరిమితవుతారు. ఈ ప్రాంతాలను సందర్శించడానికి అటవీశాఖ నావువూత్రపు రుసుంతో సహాయకులను నియమించింది. 


తంతిపందిరి(తన్నీర్‌ పందల్‌) 
ఒకప్పుడు బ్రిటీష్‌ పాలకులు చేపల పెంపకం కోసం ఎంపిక చేసిన ప్రాంతమై ఈ తన్నీర్‌ పందల్‌ ఇప్పుడు తంతిపందిరిగా మారింది. వరదయ్యపాళెం నుంచి ఇక్కడి వరకు  తారు రోడ్డు  ఉంది. ఉబ్బలమడుగు వరకు వెళ్లలేనివారు ఇక్కడి మడుగులోనే సేదదీరుతుంటారు. 
ఉబ్బలమడుగు(ఉపరి మడుగు) 
తంతి పందిరి నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉబ్బలమడుగు ఉంది.  వాహనాలలో వెళ్లేందుకు గ్రావెల్‌ మార్గం ఉంది. 1953 ప్రాంతంలో చిత్తూరుకు చెందిన శ్రీనివాసన్‌ బ్రిటీష్‌ మిలటరీలో కీలక స్థానంలో విధులు నిర్వహించి తన రిటైర్‌మెంట్‌ తర్వాత విశ్రాంత జీవనం కోసం ఈ ప్రాంతాన్ని అంగ్లపాలకుల నుంచి ఇనాంగా పొందారు. ఇక్కడే దొరమడుగు, మామిడి చెట్ల మడుగు, తంగశాలమడుగు, పూలమడుగు, చద్దికూటి మడుగులున్నాయి. శివరాత్రి రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. మిగిలిన సమయాల్లో ఆటోలు నడుస్తుంటాయి.  


సిద్ధులకోన  
పూర్వం మునులు ఈ ప్రాంతంలో ఉండటం మూలాన సిద్ధులకోన అనే పేరు వచ్చింది. ఇక్కడకు వెళ్లాలంటే ట్రాక్టరు వంటి వాహనాల్లోగానీ కాలినడకన 2కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. భక్తులు పక్కనే ఉన్న సిద్ధుల మడుగులో స్నానమాచరించి సిద్ధేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 


దిగువ శీతాలం  
లోతైన  మడుగులు, నిలువెత్తు జలపాతాలకు నెలవు ఈ దిగువశీతాలం. రెండు కొండ చరియల నడుమ ఉన్న ఈ ప్రాంతాల్లో ఎటుచూసినా తేనెతుట్టెలు కనిపిస్తుంటాయి. సిద్ధులకోన నుంచి కొండబండల నడుమ 2కి.మీ దూరం కాలినడకన దిగువశీతాలం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడున్న నీటి మడుగులు రెండు తాటిచెట్లకు పైగా లోతున్నా నీరు స్వచ్ఛంగా ఉండడంతో లోపల ఉన్న రాళ్లు సైతం కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తూంటాయి. నీటి మడుగులోకి దిగితే ఎంత వేసవిలోనైనా చలితో వణుకు తెప్పిస్తాయి. 

పర్యాటకులకు మరిన్ని వసతులు  
ఉబ్బలమడుగుకు వచ్చే సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఇప్పటికే కొన్ని వసతులు కల్పించాం. జలపాతాల వద్ద బోటింగ్‌ పార్కులు, మరో వన్య పాయింట్, విశ్రాంత గదులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనికి సంబంధించి రూ. 2కోట్ల నిధులు అవసరముంది. నిధులు కోసం ప్రభుత్వానికి నివేదిస్తాం.  
–జి. జయప్రసాదరావు,ఎఫ్‌ఆర్‌ఓ, సత్యవేడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top