‘సీఎం వైఎస్‌ జగన్‌కు సదా కృతజ్ఞుడినై ఉంటా’

Two People Neuromanitoring‌ System‌ Surgery Success Over CM Releaf Fund - Sakshi

గుంటూరు: సీఎం సహాయనిధి ఆ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది. పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేసింది. ఎన్నోఏళ్ల నుంచి గూనితో బాధపడుతున్న వారికి విముక్తి కల్పించింది. గుంటూరు కొత్తపేట నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 13, 14 తేదీల్లో న్యూరోమానిటరింగ్‌ సిస్టమ్‌ ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న కాంతారావు, వినోద్‌కుమార్‌ ఆనందంగా ఇళ్లకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆస్పత్రి స్పయిన్‌ సర్జన్‌ డాక్టర్‌ దుంపా శ్రీకాంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఒక్కొక్కరికి రూ.ఏడు లక్షల ఖరీదైన ఆపరేషన్‌ను ఉచితంగా చేసినట్టు వివరించారు. శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టిందని, గూనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీతోనే నయం చేయొచ్చని వెల్లడించారు. సమావేశంలో కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ గుండం శివశ్రీనివాసరెడ్డి, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ హర్ష, క్రిటికల్‌కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సింధు పాల్గొన్నారు.

కాంతారావు కష్టాలకు ఇక చెల్లు  
ఈచిత్రంలో ఉన్న వ్యక్తిపేరు బి.కాంతారావు. వయసు 40 ఏళ్లు. ఊరు ఊటుకూరు. గూని వల్ల వెన్నుపూస పూర్తిగా ఒంగిపోయింది. రోజువారీ కూలీపనులు చేసుకునే ఇతను చాలా కష్టపడేవాడు. కొన్నిసార్లు కాలు జాలువారేది. ఊపిరి తీసుకోవడమూ కష్టమయ్యేది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఇతనికి సీఎం సహాయనిధి వరమైంది. ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సదా కృతజ్ఞుడినై ఉంటానని చెబుతున్నాడు. 

జీవితమంతా ‘వినోద్‌’మే  
ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు వినోద్‌కుమార్‌. వయసు 17ఏళ్లు. ఊరు అమలాపురం. ఇంటర్‌ చదువుతున్నాడు. పుట్టుకతోనే గూని ఉంది. చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడేవాడు. ఇటీవల నడుంనొప్పి, కాళ్ల తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండడంతో తీరని వేదన అనుభవించాడు. వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్‌ చేయాలనడంతో ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు సీఎం సహాయనిధి ఆయన జీవితంలో వెలుగులు నింపింది. ఆపరేషన్‌ చేయించింది.

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top