ఎయి‘డెడ్‌’తో రాజకీయాలా? 

There has been a drastic reduction in enrollment in aided educational institutions - Sakshi

ప్రమాణాలు లేక దిగజారిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలు

దారి తప్పిన వ్యవస్థ

ఇప్పుడు అవసరం మేరకు ఊరూరా ప్రభుత్వ స్కూళ్లు   

నాడు–నేడు, ఇతరత్రా పథకాల ద్వారా సకల సదుపాయాల కల్పన 

అటు ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో మాత్రం భారీగా తగ్గిన చేరికలు  

కొన్ని స్కూళ్లు మూత.. మరి కొన్నింటిలో నామమాత్రం పిల్లలు  

సొంత అవసరాలకు స్కూళ్ల ఆస్తులను వాడుకొంటున్న యాజమాన్యాలు 

ఈ స్థితిలో ప్రభుత్వానికి అప్పగిస్తే తప్పేమిటంటున్న మేధావులు 

అదీ యాజమాన్యాల ఇష్టం మేరకే.. 

అలా కాదంటే వారే సక్రమంగా నిర్వహించుకునే వెసులుబాటు  

ఒక్క విద్యార్థికీ నష్టం కలుగకుండా చర్యలు.. అన్ని పథకాలూ వర్తింపు 

ఈ వాస్తవాలను విస్మరించి స్వార్థంతో ప్రతిపక్షాల దుష్ప్రచారం 

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వాల తప్పిదాలు, యాజమాన్యాల స్వప్రయోజనాలతో రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యా సంస్థలు పూర్తిగా గాడి తప్పాయి. 95 శాతానికిపైగా ఈ సంస్థల్లో కనీస బోధనాభ్యసన కార్యక్రమాలు కూడా సరిగా జరగడం లేదు. అనేక స్కూళ్లలో చేరికలు నిలిచి పోవడంతో మూతపడ్డాయి. మరికొన్నింటిలో చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విద్యార్థులు లేనందున పలు చోట్ల ప్రభుత్వ వేతనాలు పొందుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు బోధన మానేసి సొంత పనుల్లో ఉంటున్నారు. వీరిలో 90% మంది స్కూళ్లకు సరిగా హాజరు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలను, సంస్థ విద్యా కార్యకలాపాలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా ఇదే తంతు ఉండడంతో ఈ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. దాతలు ఏ ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాలను యాజమాన్యాలు విస్మరించాయి. సంస్థల ఆస్తులు, నిధులను తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించుకోవడంపైనే దృష్టి సారించాయి. 

ఇవీ వాస్తవాలు..
► బ్రిటిష్‌ పాలనా కాలంలో ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థ ప్రారంభమైంది.  దాతలు తమ సొంత ఆస్తులు, నిధులు దానంగా ఇచ్చి విద్యా సంస్థలను ఏర్పాటు చేయించారు. కాలక్రమంలో ఈ సంస్థల్లోని టీచర్లకు ప్రభుత్వం తరఫున వేతనాలు అందించడంతో పాటు ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది.  
► విద్యా హక్కు చట్టం వచ్చాక ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకు హైస్కూలు.. జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  
► ప్రభుత్వ స్కూళ్లలో అన్ని అర్హతలతో కూడిన టీచర్లతో బోధన, ఇతర సదుపాయాలతో పాటు పలు పథకాల కింద ఆర్థిక సాయం   విద్యార్థులకు అందుతోంది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో చేరికలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో ఈ విద్యా సంస్థల యాజమాన్యాలు వాటిని తమ వ్యక్తిగత స్వార్థానికి వినియోగించుకుంటున్నాయి. 
► నియామకాల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరించి డబ్బులిచ్చిన వారిని నియమించడంతో ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి.
► ప్రభుత్వ అనుమతులు లేకుండానే సిబ్బందిని నియమించుకుని, ఆ తర్వాత వారిని రెగ్యులర్‌ చేసేలా పైరవీలు చేస్తున్నాయి. ఈ సంస్థల్లో సిబ్బందికి, ఇతర కార్యకలాపాలకు ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. 
► ఎయిడెడ్‌ సంస్థల్లో సిబ్బంది ఉన్నప్పటికీ పిల్లలు ఉండడం లేదు. దీంతో ఆ సిబ్బందిని అవసరమైన చోట వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచించినా, యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ తరుణంలో ఈ సంస్థల్లో నియామకాలు, క్రమబద్ధీకరణలు ప్రభుత్వంపై విపరీత భారాన్ని మోపేవిగా మారాయి.
► అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులను ప్రభుత్వం ఆదుకొంటోంది. నాడు–నేడు కింద ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల చేరికలు బాగా పెరగడంతో అక్కడ ఉపాధ్యాయుల అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వంలోకి తీసుకున్న విద్యా సంస్థల్లోని విద్యార్థులకూ అన్ని పథకాలను వర్తింప చేస్తుంది. 
► రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు 44,639 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 33,774, ప్రాథమికోన్నత పాఠశాలలు 4,198, ఉన్నత పాఠశాలలు 6,667 ఉన్నాయి. ఎయిడెడ్‌ స్కూళ్లు మొత్తం 2,001 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 1,301, అప్పర్‌ ప్రైమరీ 258, హైస్కూళ్లు 442 ఉన్నాయి. 
► రాష్ట్రంలో చేరికలు లేక 482 ఎయిడెడ్‌ స్కూళ్లు మూత పడ్డాయి. వీటిలో 262 సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించాయి. నిర్వహణలో ఉన్న 1,988 స్కూళ్లలో 1,302 స్కూళ్లు కూడా ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించాయి. వీటిలో 1,127 సంస్థలను ప్రభుత్వంలోకి తీసుకుంటూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. 686 సంస్థలు సమ్మతి తెలపలేదు.  

సిబ్బంది, విద్యార్థుల కోసం ఇలా..
► విద్యార్థులను వారి తల్లిదండ్రుల అభీష్టం మేరకు వారు కోరుకునే సమీపంలోని మరో పాఠశాలలో చేర్చించేలా రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, డీఈవోలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.  ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పింది.
► టీచర్లను వారి సీనియార్టీని అనుసరించి ఇతర స్కూళ్లలో నియమించేలా కౌన్సెలింగ్‌ షెడ్యూలు ఇచ్చింది. నవంబర్‌7వ తేదీలోగా వీరి నియామకాలు పూర్తి చేయనున్నారు.
► ఎయిడెడ్‌ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమయ్యాక వారి సేవలను అవసరమైన ఇతర విద్యా సంస్థల్లో వినియోగించుకోనుంది. ఆయా సంస్థలు, అందులోని తాత్కాలిక అన్‌ఎయిడెడ్‌ సిబ్బందికీ చట్ట నిబంధనల ప్రకారం ఔట్‌సోర్సింగ్‌ విధానం మేరకు వేతనాలు చెల్లిస్తారు. ఇందుకు ప్రభుత్వంపై రూ.95 కోట్ల వరకు భారం పడనుంది. 

ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఇదీ పరిస్థితి
► రాష్ట్రంలో ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు 137 ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో 4 ఎండోమెంట్‌(రిలిజియస్‌) డిపార్టుమెంటు పరిధిలోవి కాగా 16 మైనార్టీ స్టేటస్‌తో ఉన్నాయి. డిగ్రీ కాలేజీల్లో ఎయిడెడ్‌ కోర్సులతో పాటు అన్‌ఎయిడెడ్‌ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంస్థల్లో సరైన చేరికలు ఉండడం లేదు. 7 డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన ఆస్తులు ఇస్తామని రాత పూర్వకంగా తెలిపాయి. 124 డిగ్రీ కాలేజీలు స్టాఫ్‌ను మాత్రమే సరెండర్‌ చేస్తామని, ఆస్తులను తామే ఉంచుకుని ప్రైవేటు కళాశాలలుగా నడుపుకుంటామని తెలిపాయి.
► డిగ్రీ కాలేజీల్లోని ఎయిడెడ్‌ కోర్సుల్లో 1,02,234 సీట్లుంటే 51,085 మంది, అన్‌ఎయిడెడ్‌ కోర్సుల్లో లక్షకు పైగా సీట్లుంటే అందులో సగం మంది మాత్రమే చేరారు. కొన్ని ప్రముఖ కాలేజీల్లో తప్ప తక్కిన వాటిల్లో 30% కూడా సీట్లు నిండడం లేదు. 
► 32 ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. 33 కాలేజీల్లో చేరికలు 50 శాతానికన్నా తక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల పది శాతం విద్యార్థులు కూడా లేరు. ఈ సంస్థల్లో ఎయిడెడ్‌ విభాగాల్లో బోధనా సిబ్బంది 1,303 మంది, బోధనేతర సిబ్బంది 1,422 మంది ఉన్నారు. అన్‌ఎయిడెడ్‌ కోర్సులకు సంబంధించి 1,621 మంది బోధనా సిబ్బంది, 909 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు.
► 122 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లోని 5 జూనియర్‌ కాలేజీలు.. ఆస్తులతో, 103 కాలేజీలు కేవలం సిబ్బందిని ఇస్తామని తెలిపాయి. 
► ఎయిడెడ్‌ పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు.. 6,900 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. జూనియర్‌ కాలేజీల్లో 40 వేల మంది విద్యార్థులు ఉన్నారు.  

10 కాలేజీలు మూత  
రాజమండ్రిలోని ఏవైఎస్‌ కాలేజ్, పాలకొల్లులోని ఎస్‌కేఆర్‌ఎస్‌ ఓరియంటల్‌కాలేజ్, గుడ్లవల్లేరులోని ఎస్‌సీఎస్‌కాలేజ్, గుంటూరులోని ఎస్‌జీహెచ్‌ఆర్, ఎంసీఎంఆర్‌ కాలేజ్, నరసారావుపేటలోని ఎన్‌బీటీ, ఎన్‌వీసీ కాలేజ్, తెనాలిలోని కేఎల్‌ఎన్‌సంస్కృత కళాశాల, పొన్నూరులోని ఎస్‌బీఎస్‌సంస్కృత కళాశాల, గుంటూరులోని డా.కేవీకే సంస్కృత కళాశాల, ఎస్‌జీకే ఓరియంటల్‌ కాలేజ్‌లు మూత పడ్డాయి. 

ఇలా చేయడం మేలేగా..
► ఈ నేపథ్యంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రత్నకుమారి నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. 
► అన్ని విధాలా నిర్వీర్యమైన ఈ సంస్థలకు ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగించాల్సిన అవసరం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది.  ఈ విషయమై ప్రభుత్వం తొలుత ఆయా సంస్థల యాజమాన్యాలు, సిబ్బందితో చర్చించింది. 
► ప్రభుత్వానికి ఆయా ఎయిడెడ్‌ సంస్థలను అప్పగించే విషయంలో నిర్ణయాన్ని యాజమాన్యాల అభీష్టానికే ప్రభుత్వం వదిలేసింది.  ప్రభుత్వానికి అప్పగించని సంస్థలు నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నడుపుకోవాలి. 

ప్రతిపక్షాల దుష్ప్రచారం
రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యా సంస్థల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే టీడీపీ సహా కొన్ని రాజకీయ పక్షాలు వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయం చేస్తున్నాయని తల్లిదండ్రులు, ఎయిడెడ్‌ సిబ్బంది నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల విద్యార్థులను రోడ్లపైకి తెస్తూ ఆందోళనలు చేపట్టడం వెనుక వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప మరేమీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా ఏకంగా 300 వరకు కోర్టు ధిక్కార కేసులు నమోదవ్వగా వాటిని ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ విషయాలన్నింటినీ టీడీపీ విస్మరించి ప్రస్తుతం దుష్ప్రచారం చేస్తుండటం గమనార్హం.  

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
రాష్ట్రంలోని ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవడాన్ని ఏపీ ఎయిడెడ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఇప్పటికే స్వాగతించింది. పూర్తి స్థాయి వేతనాలు పొందుతున్నా వివిధ కారణాల వల్ల సంపూర్ణంగా న్యాయం చేయలేకపోతున్నాం. ప్రభుత్వంలో ఎయిడెడ్‌ కాలేజీలను విలీనం చేయడం వల్ల మేమంతా బాధ్యతాయుతంగా పని చేస్తాం. ఎక్కడ అవసరమో అక్కడ మా విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కనుక విద్యార్థులకూ మేలు జరుగుతుంది.  
    – కనపర్తి త్రివిక్రమరెడ్డి, ఏపీ ఎయిడెడ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

ఎయిడెడ్‌పై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం
ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థపై శాస్త్రీయంగా అధ్యయనం చేయించి మంచి విద్యా ప్రమాణాలను అందించాలన్న ఆలోచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎయిడెడ్‌ ఆస్తులు ఇప్పటికే దుర్వినియోగం అయ్యాయి. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాటిని దాతలు ఏ లక్ష్యంతో ఇచ్చారో దానికే వాడాలని ప్రభుత్వం జీఓ ఇచ్చింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై శ్వేతపత్రం ఇస్తాం.    
– ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి 

అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు 
ప్రస్తుతం ఎయిడెడ్‌ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు సబ్జెక్టు నిపుణులు లేరు. అందువల్ల మేము అందరిలా సబ్జెక్టుల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాం. ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్‌ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు సాధించలేకపోతున్నాం. ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వంలో వీలీనం చేస్తే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు వస్తారు. మేమ అన్ని పోటీ పరీక్షల్లోను సత్తా చాటుతాం.
    – ఎస్‌.వీరదుర్గ, పదో తరగతి, గిల్డ్‌ ఆఫ్‌ సర్వీస్‌ పాఠశాల, కాకినాడ, తూర్పుగోదావరి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top