వీరి జీవనం ‘ప్రత్యేకం’

There are an estimated 125 families of Jewish nationals in AP - Sakshi

భాష–హెబ్రూ.. సంప్రదాయం–యూదు

వందల ఏళ్లుగా మాతృభాష, ఆచారాల పరిరక్షణ.. తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిస్తామన్న యూదులు  

గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో 111 ఏళ్లుగా నివాసం

సాక్షి, అమరావతి బ్యూరో/తెనాలి: రాష్ట్రంలో యూదు జాతీయులు దాదాపు 125 కుటుంబాలున్నట్టు అంచనా. వాటిలో 40 కుటుంబాల వారు గుంటూరు జిల్లా చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో జీవనం సాగిస్తున్నారు. వీరంతా ఎఫ్రాయిమ్‌ గోత్రీకులు. వీరి పూర్వీకులు తొలుత తెలంగాణ, అమరావతిలో నివసించారు. అయితే బ్రిటిష్‌ హయాంలో వీరిలో ఒకరికి కొత్తరెడ్డిపాలెం ప్రాంతంలో ఉద్యోగం రావడంతో వీరి మకాం ఇక్కడికి మారింది. ఈ 40 కుటుంబాల్లోని 300 మంది వందల ఏళ్లుగా తెలుగు జన జీవన స్రవంతిలో కలిసి పోయినా తమ మాతృ భాష, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు.  

ఏకైక ప్రార్థన మందిరం ఇదే.. 
ఏపీలో యూదుల ఏకైక ప్రార్థన మందిరం(సమాజ మందిరం) బెనె యాకోబ్‌ సినగాగె. ఇది 111 ఏళ్లుగా కొత్తరెడ్డిపాలెంలో కొనసాగుతోంది. మందిర నిర్వాహకుడి పేరు సాదోక్‌ యాకోబి. ఆయనతో పాటు ఏడుగురు పెద్దలుంటారు. వీరు మత ప్రచారం చేయరు. దేవుడి పేరు కూడా ఉచ్ఛరించరు. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్‌). ఆ రోజు అసలు పనులకు వెళ్లరు. ఆదివారం హెబ్రూ భాషకు సంబంధించిన స్కూలు నడుస్తుంది. హె బ్రూ క్యాలెండర్‌ ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ప్రస్తుతం నడుస్తోంది 5,781 సంవత్సరం. సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ‘తిషిరి’(సెప్టెంబర్‌లో వస్తుంది) నెలతో వీరి సంవత్సరం ప్రారంభమవుతుంది. పండుగ దినాల్లో యూదులంతా కలుస్తారు. పెద్ద ల ఆధ్వర్యంలో జరిగే వీరి వివాహా ల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తా రని సమాజ పెద్ద ఇట్స్‌కాక్‌ చెప్పారు.  

వీరి ఉనికి అలా తెలిసింది.. 
బెనె ఎఫ్రాయిమ్‌ గోత్రాన్ని హెబ్రూలో ‘మగద్దీన్‌’ అంటారు. వీరిని మట్టుబెట్టేందుకు కుట్ర పన్ని, రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలపై భారత ప్రభుత్వం 2004లో లష్కరే తోయిబాకు చెందిన 8 మందిని అరెస్ట్‌ చేసింది. అప్పుడే ఈ ప్రాంతంలో వీరి ఉనికి బహిర్గతమైంది. ఈ ప్రాంతంలోని ఎక్కువ మంది యూదులు వ్యవసాయ కూలీలు. ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారూ ఉన్నారు.  

‘లా ఆఫ్‌ రిటర్న్‌’లో తమ వంతు కోసం ఎదురుచూపులు  
ఇజ్రాయిల్‌ దేశం తెచ్చిన ‘లా ఆఫ్‌ రిటర్న్‌’ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న యూదు జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. మణిపూర్, మిజోరాం నుంచి ‘మనష్‌’ గోత్రీకులు పెద్దసంఖ్యలో స్వదేశం వెళ్లారు. తమ వంతు కోసం ఇక్కడివారు ఎదురుచూస్తున్నారు. 

హెబ్రూకు తెలుగుకు సంబంధం..
హెబ్రూ భాషకు తెలుగుకు దగ్గర సంబంధం ఉందని కనుగొన్నా. రెంటికీ సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించా. మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకొస్తా.
 – షమ్ముయేల్‌ యాకోబి, మత పరిశోధకుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top