
మహాధర్నాకు ౖవైద్యులు సిద్ధం
గుంటూరు మెడికల్: పేదోళ్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించినందుకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యులు ధర్నాకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని ఆషా, ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మహాధర్నాకు గుంటూరు జిల్లా నుంచి వందమందికిపైగా వైద్యులు, వైద్య సిబ్బంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆషా గుంటూరు నేతలు బుధవారం మీడియాకు వెల్లడించారు.
పేరుకుపోయిన బకాయిలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నెటవర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స అందించే ఆసుపత్రులు 95 ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సుమారు 700 వరకు చికిత్సలు, ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం సుమారు రూ. 2,700 కోట్లు ఆసుపత్రులకు ఏడాది కాలంగా చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతోపాటుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ క్లయిమ్ అప్రూవల్స్ సుమారు రూ. 670 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక పక్క నిధులు చెల్లించకుండా మరోపక్క డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని ప్రైవేటు ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇన్సూరెన్సు కంపెనీకి అప్పగించేందుకు ఏర్పాటు చేసిన గైడ్‌లైన్స్ కమిటీలో కనీసం తమకు ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం తమను పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆషా నేతలు మండిపడుతున్నారు. తక్షణమే రూ.670 కోట్లు చెల్లించడంతోపాటు గైడ్‌లైన్స్ కమిటీలో తమను కూడా భాగస్వాములను చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 10 నుంచి ఆషా ఆధ్వర్యంలో హాస్పిటల్స్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం నిలిపివేశారు. గురువారం విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే మహాధర్నా కార్యక్రమానికి ఆషా సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని గుంటూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకర్ కోరారు.
ప్రభుత్వం బిల్లులు
చెల్లించనందుకు నిరసన