‘పోతిరెడ్డిపాడు–గోరకల్లు’ అభివృద్ధి పనుల్లో రూ.16.5 కోట్లు ఆదా

Tender notification with an estimated cost of Above Rs 1017 crore - Sakshi

రూ.1,017.22 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ నోటిఫికేషన్‌ 

ప్రైస్‌ బిడ్‌లో 0.9% అధిక ధరకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన సంస్థ

రివర్స్‌ టెండరింగ్‌లో 1.622% తక్కువతో పనులు దక్కించుకున్న పీఎన్‌సీ ఇన్‌ఫ్రా

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌ఆర్‌) నుంచి గోరకల్లు రిజర్వాయర్‌ బెర్మ్‌ వరకూ కాలువ లైనింగ్‌.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా అభివృద్ధి చేసే పనుల టెండర్లలో ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. టెండర్ల ప్రక్రియను మంగళవారం స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) పరిశీలించి, ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత 1.622% తక్కువ ధరలకు పనులను దక్కించుకున్న పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ జారీ చేయనున్నారు. పీహెచ్‌ఆర్‌ నుంచి గోరకల్లు రిజర్వాయర్‌ బెర్మ్‌ వరకూ కాలువ అభివృద్ధి పనులకు రూ.1,017.22 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ విధానంలో జలవనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

► ఈ టెండర్లలో ఎన్‌సీసీ, ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా, ఓమ్‌ మెటల్స్‌ ఇన్‌ఫ్రా, పీఎన్‌సీ ఇన్‌ఫ్రా సంస్థలు బిడ్‌లు దాఖలు చేశాయి. ఓమ్‌ మెటల్ప్‌ ఇన్‌ఫ్రాకు పనులు చేసిన అనుభవం లేకపోవడంతో టెక్నికల్‌ బిడ్‌లో ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు.
► మిగిలిన మూడు సంస్థలు ప్రైస్‌ బిడ్‌కు అర్హత సాధించాయి. ప్రైస్‌ బిడ్‌లో 0.9% అధిక ధర(రూ.1026.375 కోట్లు)కు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది.
► ఎల్‌–1గా నిలిచిన సంస్థ కోట్‌ చేసిన రూ.1026.375 కోట్లను కాంట్రాక్టు విలువగా పరిగణించి.. ఈ–ఆక్షన్‌(రివర్స్‌ టెండరింగ్‌) నిర్వహించారు. రివర్స్‌ టెండరింగ్‌ గడువు ముగిసే సమయానికి 1.622% తక్కువ ధర(రూ.1,000.716)కు కోట్‌ చేసిన పీఎన్‌సీ ఇన్‌ఫ్రా సంస్థ ఎల్‌–1గా నిలిచింది.
► దాంతో ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి.
► టెండర్ల ప్రక్రియపై కర్నూలు ప్రాజెక్టŠస్‌ సీఈ మురళీనాథ్‌రెడ్డి శుక్రవారం ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి పంపారు. ఈఎన్‌సీ నేతృత్వంలో మంగళవారం ఎస్‌ఎల్‌టీసీ సమావేశమై టెండర్‌ను ఆమోదించనుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top