పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
అడుగంటి పోతున్న భూగర్భ జలాలు
పంటలను కాపాడుకోలేక రైతుల గగ్గోలు
ట్యాంకర్లతో నీటిని పెట్టేందుకు తంటాలు
ఎకరాకు రూ.1000 ఖర్చువుతోందంటూ రైతుల ఆవేదన
చీనీ రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల వినతి
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన ఈయన పేరు తలారి ఓబులేసు. 3.5 ఎకరాల్లో బత్తాయి (చీనీ) సాగు చేస్తున్నాడు. ఐదు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. బోర్లకే రూ.4.50 లక్షలు ఖర్చు చేశాడు. ఎండిపోతున్న చీనీ తోటలను కాపాడుకునేందుకు రోజూ ఐదు ట్యాంకర్లతో తోటకు నీరు పెడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నీటి కొనుగోలుకే రూ.2.70 లక్షల ఖర్చు చేశాడు.
బోర్లకు నీటి కొనుగోలుకు కలిపి రూ.7.30 లక్షలు ఖర్చు అయ్యాయి. కొద్దిపాటి పంటను అమ్మగా రూ.2.10 లక్షలు వచి్చంది. మిగిలిన పంట నీరులేక ఎండిపోతోంది. తోటలో ఆరు వేలకు పైగా చీనీ చెట్లుండగా, 100కు పైగా చెట్లు ఇప్పటికే చచి్చపోయాయి. మిగిలిన చెట్లు కూడా ఎండిపోతున్నాయి. ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నాడు.
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి కంటికిరెప్పలా పెంచుకున్న చెట్లు కళ్లెదుటే మాడిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వ్యవసాయ బోర్లలో నీరు రావడంలేదు. కొత్తగా బోర్లు వేసినా చుక్కనీరు పడే పరిస్థితి లేదు. దీనికి తోడు లోఓల్టేజ్ సమస్య వేధిస్తోంది.
పంటలకు నీరందని పరిస్థితి
రబీలో బోర్ల కింద సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగతోపాటు చీనీ, దానిమ్మ, అరటి, మిరప వంటి వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. గతేడాది కన్నా దాదాపు 3–5 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. బోర్లలో మరింత లోతుకు అదనంగా పైపులు దించినా, ఆశించిన స్థాయిలో నీరందడం లేదు. నేలలో తేమ పూర్తిగా ఆరిపోయి పంటలకు ఎక్కువ తడువు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నీరందించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అనంతపురం జిల్లాలో వందలాది ఎకరాల్లో చీనీ తోటలైతే గతంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో సాగునీరు లేక చీనీ తోటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి.
ఒక్కో ట్యాంకర్‌కు రూ.1000 ఖర్చు
రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో చీనీ పంట సాగవుతుండగా, ఒక్క అనంతపురం జిల్లాలోనే 91వేల ఎకరాల్లో చీనీ తోటలున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అవసరమైన నీరందక 5–7 ఏళ్ల వయస్సున్న చీనీ తోటలు నిట్ట నిలువునా ఎండిపోతున్నాయి. ఒక రైతు రూ.5 లక్షలు ఖర్చు పెట్టి ఆరు బోర్లువేసినా నీళ్లు పడలేదు.
ఎండిపోతున్న తోటలను కాపాడుకునేందుకు రైతులు రేయింబవళ్లు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాంకర్లతో నీళ్లు తోలేందుకు రోజుకు ఎకరాకు రూ.1,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు ఇది మరింత భారంగా మారింది. ఎండిపోతున్న చీనీ తోటల రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఎండిపోతున్న చీనీ తోటలను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.
దిగుబడులు తగ్గుతాయి
నాకు ఆరు ఎకరాల్లో చీనీతోట ఉంది. ఎకరాకు 12 టన్నుల దిగుబడులు రావాల్సి ఉండగా, ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వలన 5–6 టన్నులకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.800–1,000 చొప్పున చెల్లిస్తూ నీటిని పెట్టుకుంటున్నాం. అయినా పూర్తి స్థాయిలో నీరందే పరిస్థితి లేదు. తోటలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – గందివీటి ప్రకాష్ రెడ్డి, కోటంక, అనంతపురం జిల్లా
ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అడుగంటిన భూగర్భ జలాల కారణంగా ఏళ్లతరబడి పెంచుకున్న చెట్లు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలేందుకు రైతులు అప్పులపాలవుతున్నారు. ఎండిపోతున్న తోటలను కాపాడేందుకు నీళ్ల సరఫరా బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. ఇప్పటికే నీటి సరఫరా కోసం రైతులు పెట్టిన ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లించాలి. నీళ్లులేక ఎండిన తోటలకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం


