Telugu Natakam: నటనలో జీవిస్తూ.. నాటకాన్ని బతికిస్తూ!

Telugu Classical Theatre Arts: Telugu Natakam, Theatre Artists in Srikakulam - Sakshi

ఒకప్పుడు తెలుగునాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడమే కాకుండా ప్రజల మదిలో చైతన్య భావాలను రేకెత్తించిన సుందర దృశ్యకావ్యం నాటకం. మారుతున్న కాలంలో నేటి యువతకు నాటకంలోని రసజ్ఞతను ఆస్వాదించే ఆసక్తి లేకున్నా.. వారిని నటనతో కట్టిపడేసే సామర్థ్యం కలిగిన కళాకారులకు పుట్టినిల్లు సిక్కోలు. ఇక్కడి నాటక కళాసమితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

కవిటి: పౌరాణిక, సాంఘిక నాటకాల్లో విశేష సేవలందించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దశదిశలా మారుమోగేలా చేసిన కళాకారులు ఎంతోమంది కళామతల్లి ముద్దుబిడ్డలుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ బిరుదుపొందిన యడ్ల గోపాలరావు, మీగడ రామలింగస్వామి, ఉద్దానం ప్రాంతానికి చెందిన దివంగత బెందాళం ప్రకాష్‌ వంటి ఎందరో ఈ ప్రాంతంనుంచి నాటకాలు వేసి సినిమాల్లో సైతం తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. 2000 సంవత్సరం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు నాటక సమాఖ్యలు ఉండేవి. కాలక్రమంలో వీటిసంఖ్య సగానికి తగ్గిపోయింది.


కవిటి ఉద్దానం ప్రాంతం బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళానికి చెందిన శ్రీశయన నాటక సమాఖ్య, నందిగాం మండలం పెద్దతామరాపల్లి శ్రీవేంకటేశ్వర నాటక కళాసమితి, టెక్కలిలో ప్రజాచైతన్య నాటక కళా సమితి, కోటబొమ్మాళి మండలం లఖిందిడ్డిలో శ్రీనివాస నాటక కళాసమితి, సంతబొమ్మాళి మండలం వడ్డివాడలో చైతన్య నాటక కళాసమితి తమ కళాసేవల్ని నేటికీ కొనసాగిస్తున్నాయి.

శ్రీకాకుళంలో మిత్రా సాంస్కృతిక సమాఖ్య, ఉద్దానం ప్రాంతంలో భైరిపురం, బి.గొనపపుట్టేగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, మఖరాంపురం, కత్తివరం గ్రామాల్లో నాటక పరిషత్‌ పోటీలు తరచుగా నిర్వహిస్తూ సాంఘిక నాటిక కళాసౌరభాల్ని భావితరాలకు అందించడంలో విశేషంగా కృషిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో 60 ఏళ్లుగా నాటికలు వేసే ప్రక్రియ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బొరివంకలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఏర్పడిన శార్వాణి నాటక సమితి సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి.

‘నంది’సంతృప్తి అనిర్వచనీయం
నాటిక ప్రదర్శనల్లో మూడు దశాబ్దాలుగా భాగస్వామిగా నటజీవితం కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం పొందడం మరపురాని అనుభూతి.
–పిరియాచలపతిరావు, శార్వాణీ నాటక సమాఖ్య, బొరివంక

నిర్మాణంలో కళావేదిక..
బొరివంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కళావేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత  తెలుగురాష్ట్రాల నాటిక పరిషత్‌ పోటీలు నిర్వహించాలన్న అభిలాష ఉంది.  
–బల్లెడ లక్ష్మణమూర్తి, గౌరవాధ్యక్షుడు, శార్వాణీనాటక సమాఖ్య, బొరివంక

కళాపోషణ ఉండాలి.. 
మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి.. అనే తెలుగు సినిమా డైలాగు నన్నెంతగానో ప్రభావితం చేసింది. వృత్తి వ్యవసాయమైనా కళారంగంపై మక్కువ నన్ను నటన వైపు ఆకర్షించేలా చేసింది. 
– బెందాళం శోభన్‌బాబు, సీనియర్‌ నటుడు, శార్వాణీనాటక సమాఖ్య 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top