కొండపై సొరంగాలు.. | TDP Leaders Illegally Digging at Palnadu District | Sakshi
Sakshi News home page

కొండపై సొరంగాలు..

May 3 2026 5:14 AM | Updated on May 3 2026 5:14 AM

TDP Leaders Illegally Digging at Palnadu District

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం కొండపై తవ్వతీసిన రంగురాళ్లు

బరితెగించేసి కొండకు కన్నం పెట్టిన టీడీపీ నాయకులు

రంగురాళ్ల కోసం శంకరపురం కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు

100 అడుగుల లోతులో భారీ సొరంగాలు ఏర్పాటు  

సేకరించిన రంగురాళ్లు మెట్రో నగరాల్లో విక్రయం  

ఇప్పటికే రూ.కోట్లకు పడగలెత్తిన టీడీపీ నాయకులు  

చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో బరితెగిస్తున్న నేతలు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అటవీ భూముల్లో లభించే సహజ సంపదను కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు దోచేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో రంగురాళ్లు (క్రిస్టల్, క్వార్ట్జ్‌) కోసం కొండను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి రంగురాళ్లు తీసి హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్, పుణే, ముంబయి తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల సహాయ సహకారాలు, టీడీపీ ముఖ్య నేతల అండదండలతో ఆ పార్టీ స్థానిక నాయకులు రంగురాళ్ల అక్రమ వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తారన్నది జగమెరిగిన సత్యం. పచ్చని కొండను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.   

కొండపై సొరంగాలు తవ్వి రంగురాళ్ల సేకరణ  
దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో శంకరపురం అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా సుగాలీలు నివసిస్తుంటారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో రంగురాళ్లు నిక్షిప్తమైన కొండ ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండకు కన్నం వేయాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు రచించారు. ముఖ్యనేతలు రంగంలోకి దిగి కొండపై అక్రమంగా తవ్వకాలు జరిపేలా స్కేచ్‌ వేశారు. శంకరపురంతోపాటుగా భట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు, దాచేపల్లి గ్రామాల్లో ఎంపిక చేసుకున్న కూలీలను కొండపైకి తరలిస్తున్నారు.

కొండ లోపలికి దిగి తవ్వకాలు జరిపేందుకు వీలుగా జనరేటర్లు, టార్చిలైట్లు కూడా ఏర్పాటు చేశారు. రోజూ కొండపై రంగురాళ్ల కోసం కూలీలతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండకు కన్నం వేసి వందల కిలోల రంగురాళ్లను బయటకు తీస్తున్నారు. కొండపై సుమారుగా 100 అడుగుల లోతులో కూడా  సొరంగాలు తవ్వారంటే ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. సొరంగాల్లోకి వెళ్లిన కూలీలకు బ్లోయర్స్‌ ద్వారా కొండపై నుంచి ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నారు. లోపలి భాగంలో దాగి ఉన్న రంగురాళ్లు కనిపించేలా లైట్లు కూడా ఏర్పాటు చేశారు.  

ప్రమాదభరితంగా సొరంగాలు 
శంకరపురం కొండపై ఉన్న సొరంగాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ కూలీలు తీసిన సొరంగాల్లోకి వెళ్లిన పలువురు గాయాలపాలయ్యారు కూడా. కొందరు కూలీలు ఊపిరాడక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇవేవీ బయటకు రాకుండా చేస్తున్నారు. సొరంగాల్లో తవ్వకాలు జరిపే కూలీల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

కూలీలను బెదిరించి... దోచుకుంటున్న టీడీపీ నేతలు 
శంకరపురం కొండను కొల్లగొట్టి రంగురాళ్లు తవ్వుకుని టీడీపీ నాయకులు భారీగా సంపాదిస్తున్నారు. కొండలో లభించే రంగురాళ్లలో నాణ్యతను బట్టి కేజీ రూ.1,000 నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. రూ.10 వేలు విలువ చేసే రాయి దొరికితే... టీడీపీ నాయకులు కూలీలను భయపెట్టి నామమాత్రపు డబ్బులు ఇచ్చి వారి శ్రమను దోచుకుంటున్నారు. వచ్చిందంతా మాదే అంటూ భయపెడుతున్నారు. మాకు తెలియకుండా రంగురాళ్లను అమ్మితే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక పొట్టకూటి కోసం కూలీలు టీడీపీ నాయకులు ఇచ్చింది తీసుకుంటున్నారు. ఆ నాయకులేమో హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, పుణే, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులపాటు రంగురాళ్ల అమ్మకాలు జోరుగా జరుగుతుంటాయని కూలీలు చెబుతున్నారు.  

దాచేపల్లిలోని ఓ గొడౌన్‌లో టీడీపీ నేతలు భద్రపరచిన రంగురాళ్లను శుక్రవారం రాత్రి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన రంగురాళ్ల విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు కొండకు కన్నం వేసి కోట్లకు పడగలెత్తుతున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనమని పలువురు అంటున్నారు.

అక్రమార్కులతో అటవీశాఖ సిబ్బంది చెట్టాపట్టాల్‌  
శంకరపురం కొండపై టీడీపీ నాయకుల పర్యవేక్షణలో రేయింబవళ్లు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండపై తవ్వకాలు జరుపుతుంటే ఆ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. కొండ కింద తనిఖీల కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ బాక్స్‌ ఎప్పుడూ తాళం వేసినట్లుగానే కనిపిస్తుంది.

కొండపైన తవ్వకాలు జరుగుతున్నా ఇక్కడి సిబ్బంది తనిఖీలు కూడా చేయకుండా వదిలేశారు. టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని అటవీశాఖ సిబ్బంది తిరుగుతుండటం వల్లే కొండపై తవ్వకాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. తనిఖీలు చేసినా... నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. రంగురాళ్ల తవ్వకాల్లో అటవీశాఖ సిబ్బందికీ వాటాలున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొండపై అక్రమ తవ్వకాలను అటవీశాఖ అధికారులు అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement