కిడ్నీ రోగులకు రిస్కు తగ్గిస్తున్న సముద్ర చేపలు.. రాళ్లు, కొవ్వు పదార్థాలు బయటకు! కీలక విషయాలు వెల్లడి

Taking sea fish as food does not lead to chronic diseases - Sakshi

సముద్ర చేపల్లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికం

కవ్వలు, కానాగంతలు, మాగ, పొలస వంటి చేపలతో ప్రయోజనం

వారానికి రెండుసార్లు తింటే కిడ్నీ రోగులకు రిస్క్‌ తగ్గినట్టు గుర్తింపు 

జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ వర్సిటీ పరిశోధనలో వెల్లడి

చమురు చేపలుగా పిలిచే సముద్ర చేపల్ని ఆహారంగా తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. క్రమం తప్పకుండా చేపలు తినేవారిలో క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం వంటి రోగాల బారినపడే ప్రమాదం తక్కువని తేలింది. కాగా, తీవ్రమైన కిడ్నీ రోగాల బారిన పడినవారు సముద్ర చేపల్ని తింటే 8 నుంచి 10 శాతం రిస్క్‌ తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది.

సాక్షి, అమరావతి: ప్రపంచ జనాభాలో 10 శాతం (80 కోట్ల) మంది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధుల (క్రానిక్‌ కిడ్నీ డిసీజెస్‌)తో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్యం మనుషుల మరణానికి కూడా దారి తీస్తోంది. ఇలాంటి వారికి సముద్ర చేపలు రిస్క్‌ తగ్గిస్తున్నాయని తేలింది. సముద్ర చేపల్లో అధికంగా ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ మూత్రపిండాల సమస్యల నుంచి ఉపశమనం ఇస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. మొక్కల నుంచి వచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ కంటే సముద్ర చేపల్లో ఉండే యాసిడ్స్‌ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది.

సముద్రంలో దొరికే కవ్వలు, కానాగంతలు (కన్నంగదాత), పొలస, మాగ వంటి వందకు పైగా చమురు చేపలు, సముద్రపు మంచి పీతలు తిన్న వారిపై జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిశోధనలు జరిపింది. ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే సముద్ర చేపల్ని తినడం వల్ల మూత్రనాళాలు శుభ్రపడతాయని, వాటిలో పేరుకుపోయే రాళ్లు, కొవ్వు పదార్థాలు బయటకు పోతాయని గుర్తించారు.

12 దేశాలకు చెందిన 25 వేల మందికి పైగా కిడ్నీ రోగాల బాధితులపై జరిపిన 19 రకాల అధ్యయనాల ఫలితాలను వర్సిటీ వెల్లడించింది. కచ్చితంగా ఏ చేపలు ఎక్కువగా మూత్రపిండాల వ్యాధు­ల రిస్క్‌ను తగ్గిస్తున్నాయో చెప్పలేకపోయిన­ప్పటికీ.. వాటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్‌ రక్తం స్థాయిలను పెంచడంలో ప్రభా­వం చూపిస్తున్నా­యని గుర్తించారు.

వారానికి రెండుసార్లు తింటే..
తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారినపడిన 49 నుంచి 77 ఏళ్ల వయసు వారిపై ఈ పరిశోధనలు జరిపారు. శరీరం బరువు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారితో పాటు శారీరక దైనందిన కార్యకలాపాలు, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అధిక మోతాదులో సముద్ర చేపలు తిన్న వారిపై వివిధ రూపాల్లో పరిశోధనలు జరిపారు. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ప్రభావం మూత్రపిండాల వ్యాధుల తీవ్రతను 8నుంచి 10 శాతం వరకు తగ్గించిందని గుర్తించారు.

వారానికి కనీసం రెండుసార్లు సముద్ర చేపలు తింటే రోజుకు 250 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమకూరుతున్నట్టు తేల్చారు. అవి కిడ్నీ వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేస్తాయని.. ఒకవేళ కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే రిస్క్‌ శాతం తగ్గుతోందని పరిశోధనల్లో వెల్లడైనట్టు శాస్త్రవేత్త డాక్టర్‌ మట్టిమార్క్‌ లుండ్‌ వెల్లడించారు. చమురు చేపలు/సముద్ర చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నట్టు ఇటీవల వర్సిటీ విడుదల చేసిన జర్నల్‌లో ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top