కొమిరేపల్లిలో వింతవ్యాధి

Strange disease in Komirepalli - Sakshi

సాక్షి ప్రతినిధి ఏలూరు/దెందులూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి దెందులూరు మండలం కొమిరేపల్లి గ్రామానికీ విస్తరించింది. గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి 25 మంది ఫిట్స్‌తో పడిపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గ్రామాన్ని సందర్శించి, గ్రామంలో ఇంటింటి సర్వే చేయించారు. బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి పరిస్థితులపై సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. దీంతో ఆయన వెంటనే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ను పంపించగా.. వారు బాధితులను కలిసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలని.. అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించి, బాధితులను వెంటనే ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందాలను పిలిపించారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ సునంద, డైరెక్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ హెల్త్‌ డాక్టర్‌ గీతా ప్రసాదిని తదితరులు ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు వివరించారు. ఇదిలావుండగా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయగా, గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన ఘంటశాల వెంకటలక్ష్మి వైద్య శిబిరం వద్ద హడావిడి చేశారు. స్థానికులతో గొడవకు దిగిన జనసేన నేతలు ఒక దశలో జిల్లా ఎస్పీని సైతం తోసేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి కింద పడిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను తీసుకెళ్లే అంబులెన్స్‌కు అడ్డంగా కూర్చున్నారు.  

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ : సీఎస్‌ 
ప్రజల ఆరోగ్యంపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ అన్నారు. కొమిరేపల్లిలో బాధితులు, వారి కుటుంబ సభ్యులను కలిసి ఏవిధంగా అనారోగ్యం పాలైందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇది కుట్రే : ఆళ్ల నాని 
జిల్లాలో వరుస ఘటనల వెనుక ప్రజలు అనుకుంటున్నట్లుగానే తానూ రాజకీయ కుట్ర కోణం ఉన్నట్లు భావించాల్సి వస్తోందని మంత్రి ఆళ్ల నాని అన్నారు. వ్యాధి నుంచి కోలుకున్న బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన ఆయన వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో వింత వ్యాధి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపామని, రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, బాధితులను తరలిస్తుండగా జనసేన నేతలు అంబులెన్స్‌ను అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో ప్రజలకు ఏదో రాజకీయ కుట్ర జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top