మా హక్కులను పరిరక్షించాకే అనుసంధానం చేపట్టాలి | State Govt on Godavari Kaveri Linkage | Sakshi
Sakshi News home page

మా హక్కులను పరిరక్షించాకే అనుసంధానం చేపట్టాలి

Nov 23 2023 5:51 AM | Updated on Nov 23 2023 2:41 PM

State Govt on Godavari Kaveri Linkage - Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. తమ రాష్ట్ర హక్కులను పరిరక్షించాకే కావేరికి గోదావరి నీటిని తరలించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద నదుల అనుసంధానం చేపట్టనున్న తరహాలోనే రాష్ట్రంలోనూ నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కోరింది. ఈ అంశంపై చర్చించడానికి విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ చేసిన సూచనకు కేంద్రం అంగీకరించింది.

కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ 72వ పాలకమండలి సమావేశం వర్చువల్‌ విధానంలో బుధవారం జరిగింది. ఇందులో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్‌ జనరల్‌ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుశ్వీందర్‌సింగ్‌ వోరాతోపాటు అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో సాగు, తాగునీటి కొరతను అధిగమించే లక్ష్యంతో చేపట్టటనున్న గోదావరి–కావేరి అనుసంధానానికి అంగీకరిస్తూ అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేస్తే పనులు ప్రారంభిస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలకు సూచించారు.

గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా (నికర జలాలు) మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ తేల్చిన నేపథ్యంలో అనుసంధానం ఎలా చేపడతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని డిమాండ్‌ చేశాయి. నికర జలాల్లో మిగిలిన జలాలు, వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్‌ పూర్తి హక్కులు ఇచ్చిందని.. వాటిని పరిరక్షిస్తూ అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అనుసంధానంపై బేసిన్‌లోని రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. అన్ని రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకొస్తేనే గోదావరి–కావేరి చేపడతామని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement