బాబు చేతిలో మండలి మాజీ చైర్మన్‌కు ఘోర అవమానం

Shariff Mohammed Ahmed humiliated by Chandrababu Naidu - Sakshi

సాక్షి, మదనపల్లె: ముస్లింలపై చంద్రబాబుది కపట ప్రేమేనని మరోసారి రుజువైంది. చంద్రబాబు సోమవారం అన్నమయ్య జిల్లా పీలేరు సబ్‌ జైలు వద్ద మైనారిటీ రాష్ట్ర నాయకుడు, శాసన మండలి మాజీ చైర్మన్, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, పార్టీ క్రమశిక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు కూడా అయిన మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ను ఘోరంగా అవమానించారు.

సబ్‌ జైలులో ఉన్న ముస్లిం నేతల పరామర్శకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  మైనారిటీ నాయకులందరూ పెద్ద సంఖ్యలో పీలేరుకు రావాలని టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కోరడంతో అహ్మద్‌ షరీఫ్‌ కూడా సోమవారం గుంటూరు నుంచి అక్కడకు వెళ్లారు. చంద్రబాబు రాకముందే పీలేరు సబ్‌ జైలు వద్దకు వచ్చారు. ఇంతలో పోలీసు అధికారులు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తామని చెప్పారు. అందులో షరీఫ్‌ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు అసహనం వ్యక్తంచేశారు. అక్కడ ఉన్న టీడీపీ నాయకులు కనీసం పట్టించుకోలేదు. గంట తర్వాత చంద్రబాబు వచ్చారు. కార్యకర్తలను పలకరిస్తూ జైలు వద్దకు వెళ్లారు. షరీఫ్‌ను చూసి దగ్గరకు వచ్చి వేలు చూపించి వస్తావా అన్నట్లు సైగ చేశారు. వస్తానని చెప్పి ముందుకు వస్తుంటే.. పట్టించుకోకుండా తన అనుచరగణంతో గబగబా లోపలకు వెళ్లిపోయారు. అక్కడ ఉన్న కార్యకర్తలు ఆయన్ని నెట్టివేయడంతో మనస్తాపానికి గురయ్యారు. సబ్‌ జైలు నుంచి దూరంగా వెళ్లిపోయారు.

చదవండి: (మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు.. 20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..)

ఆయన అనుచరులు టీడీపీ నాయకులను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన టీడీపీ నాయకులు ఆయన్ని అక్కడికి తీసుకొచ్చారు. అరగంట తర్వాత చంద్రబాబు బయటకు వచ్చాక షరీఫ్‌ను ఆయన పక్కన నిల్చోబెట్టారు. బాబు ప్రసంగం తర్వాత మైనారిటీల నాయకుడిగా ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తారని అందరూ భావించారు. ఇక్కడా భంగపాటే ఎదురైంది. ప్రసంగం అవగానే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పట్టనట్లే వెళ్లిపోయారు. దీంతో షరీఫ్‌ అనుచరులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు నుంచి రమ్మని టెలీకాన్ఫరెన్స్‌లో ఆహ్వానించి, తీరా వచ్చాక అవమానించడం దేనికంటూ వాపోయారు. టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్, ఇతర మైనారిటీ నాయకులకు కూడా ఇదే భంగపాటు ఎదురైంది.

చదవండి: (AP: రైతులకు 25 ఏళ్లు ఉచిత విద్యుత్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top