మానవ సహిత గగన్‌యాన్‌.. ఎల్‌వీఎం–3 భారీ రాకెట్‌ ద్వారా రోదసిలోకి మనుషులు

Shar director Arumugam Rajarajan at Republic day celebrations - Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌ వెల్లడించారు. శ్రీహరికోట రాకెట్‌ కేంద్రంలోని స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌ మైదానంలో గురువారం గణతంత్ర వేడుకల అనంతరం భాస్కర్‌ అతిథి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గగన్‌యాన్‌కు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా భూస్థిర పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దీనికి సంబంధించి 2022లో తొమ్మిది రకాల సాలిడ్‌ మోటార్‌ స్టాటిక్‌ టెస్ట్‌లు నిర్వహించామన్నారు.

మరో 30 రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది ఆఖరు నాటికి క్రూ మాడ్యూల్‌తో ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముందు రెండుసార్లుగా మానవ రహిత ప్రయోగాలను నిర్వహించాక 2024 ఆఖరు నాటికి ఎల్‌వీఎం–3 భారీ రాకెట్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు ఇస్రోలో అన్ని సెంటర్లు దీనిపై దృష్టిసారించి పనిచేస్తున్నాయన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుని దీనికోసం ఇస్రోలో ప్రతిఒక్కరు కృషిచేస్తున్నారని రాజరాజన్‌ చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో గగన్‌యాన్‌ ప్రయోగంలో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

2023లో 11 ప్రయోగాలు లక్ష్యం
ఇక ఈ ఏడాది 11 ప్రయోగాలు లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేస్తున్నామని రాజరాజన్‌ తెలిపారు. ఇందులో ఈ ఏడాది పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఐదు రాకెట్లు, ఎల్‌వీఎం–3లో రెండు, జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రెండు, ఎస్‌ఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో రెండు ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఇందులో ఫిబ్రవరి మూడో వారంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికిల్‌) డీ2 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం ఐదు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నామన్నారు.

ఎల్‌వీఎం–3 రాకెట్ల ద్వారా వన్‌వెబ్‌ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను, చంద్రయాన్‌–3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజరాజన్‌ చెప్పారు. అలాగే, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా నావిగేషన్, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని కూడా తెలిపారు. మరోవైపు.. షార్‌ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ (పీఐఎఫ్‌) భవనం నిర్మాణం పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్‌ రన్‌ను నిర్వహించామని.. రెండో ప్రయోగ వేదికకు సంబంధించి సెకండ్‌ వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు.

పీఎస్‌ఎల్‌వీ సీ55 ఇంటిగ్రేషన్‌తో సెకండ్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మొత్తం మీద షార్‌లోని అన్ని సదుపాయాలను ఉపయోగించి ఈ ఏడాది 11 ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తద్వారా ఈ ఏడాది కూడా స్పేస్‌ రీఫార్మ్‌ ఇయర్‌గా చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. చివరగా.. ప్రైవేట్‌ ప్రయోగాల విషయంలో ఎవరైనా స్టార్టప్‌ కంపెనీలతో వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top