
ఉపాధి హామీ పథకంలో నిబంధనలు మరింత కఠినతరం
పని ప్రదేశంలో రెండు విడతల హాజరు నమోదుకు పటిష్ట చర్యలు
కూలీల ఫొటోలపై ఇకపై ఆయా పంచాయతీ కార్యదర్శుల నిఘా
జిల్లా కార్యాలయాల్లో ప్రతి ఫొటో భద్రం.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో కూలీల దొంగ మస్టర్ల కట్టడికి కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సాంకేతిక చర్యలతో పాటు, సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ బాధ్యతలను మరింత పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నాలుగు రోజుల కిందట రాష్ట్రాలకు లేఖ రాసింది.
యాప్ ఆధునికీకరణ
కూలీల హాజరు ప్రక్రియలో మస్టర్ల వారీగా ఆయా మస్టర్లలో పేర్కొనే కూలీలను పనిచేసే చోట రెండు సార్లు ఫొటో తీసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. ఉదయం పనికి రాగానే ఒకసారి, నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటోలు తీసి వాటిని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కూలీల వేతన చెల్లింపులకు ఈ ఫొటోలు తప్పనిసరి. పనికి హాజరైన కూలీల ఫొటో ఒక విడత మాత్రమే నమోదు చేస్తూ, రెండో విడత నమోదు చేయకుంటే.. ఆ మరుసటి రోజు కూలీల నమోదుకు సంబంధించిన ఫొటో అప్‌లోడ్‌కు ఇకపై అవకాశం ఉండదు.
ఈ నిబంధనలను కొద్ది నెలల కిందట నుంచే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మన రాష్ట్రంతో సహా మరికొన్ని రాష్ట్రాల్లో పైలెట్‌గా అమలు చేస్తోంది. అయితే, పైలెట్ కార్యక్రమంలో మన రాష్ట్రంతో సహా కొన్ని రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది చేస్తున్న మోసాలను పసిగట్టి యాప్‌ను ఆధునికీకరించడంతో పాటు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. ఒక ఫొటోను మాత్రమే అప్‌లోడ్ చేసి, రెండో విడత ఫొటో నమోదు చేయకుండా ఏ రోజుకా రోజు మొబైల్‌లో ఆ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి, అదే యాప్‌ను మరుసటి రోజు తిరిగి ఇన్‌స్టాల్ చేసి మళ్లీ ఒక ఫొటోను మాత్రమే అప్‌లోడ్ చేస్తున్నట్టు కేంద్ర అధికారులు గుర్తించారు.
ఏఐ ఇట్టే పసిగట్టేస్తుంది..
ఉపాధి హామీ పథకంలో చేపట్టే ఏ పని అయినా, ఆ పని మంజూరు సమయంలో ఆ పని ప్రదేశ జియో ట్యాగింగ్ వివరాలను నమోదు చేయడం కొన్నేళ్ల నుంచి అమల్లో ఉంది. అయితే, ఇప్పుడు మంజూరు సమయంలో ఆ పని ప్రదేశంగా పేర్కొనే జియో ట్యాగింగ్ వివరాలకు కేవలం పది మీటర్ల పరిధిలో కూలీల రోజు వారీ హాజరు.. రెండు విడతల ఫొటోలు తీస్తేనే ఆ ఫొటోలను యాప్‌లో నమోదుకు వీలుండేలా యాప్‌ను సాంకేతికంగా కేంద్రం ఆధునికీకరించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఒకరిద్దరితోనే వేర్వేరు ఫొటోలతో ఎక్కువ మంది పనికి హాజరయినట్టు మస్టరు నమోదుకు కూడా వీల్లేకుండా ఏఐ సాయంతో పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఒకే వ్యక్తిని ఒకే రోజు రెండు మూడు మస్టర్లకు సంబంధించిన ఫొటోల్లో నమోదు చేసేందుకు యత్నిస్తే.. ఏఐ ఇట్టే పసిగట్టేస్తుంది.
ఆ ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించాల్పిందే..
ఫీల్డ్ అసిస్టెంట్లు తీసే ఆయా ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించి ఎంపీడీవోకు నివేదిక ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. మండల స్థాయి అధికారులు ఎన్ని ఫొటోలు సరిగ్గా తీశారు? అనేవి చెక్ చేయాలని పేర్కొంది. మండల పరిధిలో అన్ని గ్రామాల నుంచి వచ్చిన వాటిలో 20 శాతం వివరాలను జిల్లా అధికారులకు పంపించాలంది. జిల్లా కార్యాలయాల్లో సైతం ప్రతి ఫొటోను జాగ్రత్తగా స్టోర్ చేయాలని కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియలో అలసత్వం వహించే పంచాయతీ కార్యదర్శి, మండల, జిల్లా అధికారులపై చర్యలు తీసుకునేలా చూడాలని కేంద్రం రాసిన లేఖలో పేర్కొంది.