
దాచేపల్లి 3వ వార్డు నుంచి మూడు ప్రాంతాల తొలగింపు
దీంతో వార్డులో తగ్గిన 484 ఓట్లు
ఈ ప్రాంతాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలమైనవని తీసేశారు
ఉప ఎన్నిక నేపథ్యంలో నేతల కుట్రకు అధికారుల వత్తాసు
నిబంధనలకు విరుద్ధమైనా వార్డు నుంచి ఈ ప్రాంతాల తొలగింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిన్న వార్డులోను ఓటమి భయం వెన్నాడుతున్న కూటమి నేతలు కుట్రలు పన్ని వార్డును విచ్ఛిన్నం చేశారు. ఉప ఎన్నికల సమయంలో వార్డులో ప్రాంతాలను తొలగించకూడదని నిబంధనలున్నా.. నేతల కుట్రకు అధికారులు వత్తాసు పలికారు. వార్డులోంచి ఈ ప్రాంతాలను ఎందుకు తొలగించారని స్థానికులు ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నములుతున్నారు. 484 ఓట్లున్న ఈ ప్రాంతాలు వైఎస్సార్‌సీపీకి అనుకూలమైనవనే కారణంతోనే ఈ దురాగతాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో ఈ అప్రజాస్వామిక పనులు యథేచ్ఛగా సాగుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి.. దాచేపల్లి, నడికుడి పంచాయతీలను కలిపి దాచేపల్లి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయించారు. ఈ నగర పంచాయతీకి 2023లో తొలి ఎన్నికలు జరిగాయి. మూడోవార్డు నుంచి విజయం సాధించిన మునగా రమాదేవి వైఎస్సార్‌సీపీ తరఫున తొలి నగర పంచాయతీ చైర్‌పర్సన్ అయ్యారు. అప్పుడు ఈ వార్డులో 1,596 ఓట్లున్నాయి. రమాదేవికి 189 ఓట్ల మెజార్టీ లభించింది. తరువాత అనారోగ్యంతో రమాదేవి మరణించడంతో మూడోవార్డుకు ఉప ఎన్నిక నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు నగర పంచాయతీ అధికారులను ఆదేశించారు. దీంతో కూటమి నేతల్లో భయం మొదలైంది. ఈ వార్డులో గెలిచే సత్తా లేదు కాబట్టి వార్డునే విచ్ఛిన్నం చేయాలని కుట్రపన్నారు. వారు చెప్పినట్లే అధికారులు చేసేశారు. గతంలో ఈ వార్డు పరిధిలో ఉన్న చేపలగడ్డ, రంగనాయకస్వామి దేవాలయం, బొడ్రాయి సెంటర్ ప్రాంతాలను ఈ వార్డు నుంచి తొలగించారు. గతంలో 1,596 ఓట్లున్న ఈ వార్డులో ఇప్పుడు 1,112 ఓట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు ఓటర్ల జాబితా నమూనా సిద్ధం చేశారు. ఈ వార్డు నుంచి తొలగించిన మూడు ప్రాంతాల్లో 484 ఓట్లున్నాయి.
స్పందించని కమిషనర్
ఈ విషయంలో నగర పంచాయతీ కమిషనర్ జి.వెంకటేశ్వర్లు వ్యవహారశైలి వివాదస్పదంగా మారింది. ఉప ఎన్నిక నేపథ్యంలో తమ ప్రాంతాలను వార్డులోంచి ఎందుకు తీసేశారని అడిగితే ఆయన స్పందించడంలేదని ఆయా ప్రాంతాల వారు చెబుతున్నారు. ఉప ఎన్నిలో టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఆయన వ్యవహారశైలి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కూటమి నేతలు చెప్పినట్లే కమిషనర్ పనిచేస్తున్నారు
దాచేపల్లి 3వ వార్డులో 484 ఓట్లు మాయం కావటంపై కమిషనర్‌ను కలిసి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించాం. మేం వెళ్లిన ప్రతిసారి కమిషనర్ దాటవేత ధోరణిలో మాట్లాడుతున్నారు. కూటమి నేతలు చెప్పిన విధంగానే కమిషనర్ పనిచేస్తున్నారు. – షేక్ సుభాని, వైఎస్సార్‌సీపీ దాచేపల్లి పట్టణ కన్వినర్
మా ఓట్లు తీసే అధికారం కమిషనర్‌కు ఎక్కడిది?
మూడోవార్డులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు మాయమయ్యాయి. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని మా ఓట్లను ఈ వార్డు నుంచి మాయం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. దీనికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతాం. – కోలా శ్రీనివాసరెడ్డి, 3వ వార్డు ఓటర్
ఓట్ల మాయంపై పరిశీలిస్తాం
దాచేపల్లి మూడోవార్డులో 484 ఓట్లు మాయం కావడంపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై బీఎల్వోల ద్వారా సమాచారం తెప్పించుకుంటాను. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – జి.వెంకటేశ్వర్లు, కమిషనర్, దాచేపల్లి నగర పంచాయతీ