వేగంగా విద్యార్థుల తరలింపు | Rapid student evacuation | Sakshi
Sakshi News home page

వేగంగా విద్యార్థుల తరలింపు

Mar 4 2022 4:49 AM | Updated on Mar 4 2022 9:36 AM

Rapid student evacuation - Sakshi

ఢిల్లీలో ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులకు స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ ఎంపీ సత్యవతి

సాక్షి, అమరావతి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను వేగంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల మార్గాలను అన్వేషిస్తోంది. గడిచిన 24 గంటల్లో 116 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి ముంబై, ఢిల్లీ నగరాలకు చేరుకుంటున్నారు. ఇందులో కొంత మంది ఇప్పటికే చేరుకోగా, మరికొంత మంది ఈ అర్థరాత్రిలోగా స్వదేశానికి చేరుకుంటారు. ఇలా వచ్చిన విద్యార్థులను అధికారులు వారి సొంత ఊళ్లకు క్షేమంగా చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం నాటికి ఉక్రెయిన్‌ నుంచి ఇండియాకు వచ్చిన విద్యార్థుల సంఖ్య 196కు చేరింది. ఉక్రెయిన్‌లో ఇంకా 586 మంది విద్యార్థులు ఉన్నట్లు కాల్‌ సెంటర్స్‌కు వచ్చిన సమాచారం ద్వారా అంచనా వేశారు. ఈ వివరాలను విదేశాంగ శాఖకు అందించడమే కాకుండా, వీరిని స్వదేశానికి వేగంగా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. 

ఈ నెల 8లోగా అందరినీ తీసుకొస్తాం 
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ ఈ నెల 8వ తేదీ లోగా స్వస్థలాలకు తీసుకొస్తామని వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి తెలిపారు. విదేశీ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆమె ఏపీ భవన్‌లో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విదేశీ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ సమావేశంలో విద్యార్థుల తరలింపుపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాల గురించి సమావేశం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కాగా, ఉక్రెయిన్‌ నుంచి గురువారం 86 మంది ఏపీ విద్యార్థులు విడతల వారీగా ఢిల్లీకి చేరుకున్నారు. వారికి ఏపీ భవన్‌లో భోజనం, వసతి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి స్వస్థలాలకు పంపడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
   
విద్యార్థులకు స్వాగతం  
విమానాశ్రయం(గన్నవరం): ఉక్రెయిన్‌ నుంచి మరో ఏడుగురు వైద్య విద్యార్థులు గురువారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో విజయవాడకు చెందిన పి.విహారి, మేరీ మంజరి, పోలూరు హారతి, ఆగిరిపల్లికి చెందిన కావాటి నరసింహారావు, చిన్నఆగిరిపల్లికి చెందిన పామర్తి అజయ్, కొలకలూరుకు చెందిన షేక్‌ రేష్మ, దాచేపల్లికి చెందిన కటకం రమ్యశ్రీ, ఉన్నారు. వీరందరికీ రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు.  

ఐదుగురు విద్యార్థులు చిత్తూరు జిల్లాకు రాక
చిత్తూరు కలెక్టరేట్‌: ఉక్రెయిన్‌ నుంచి చిత్తూరు జిల్లా విద్యార్థులు ఐదుగురు గురువారం క్షేమంగా స్వస్థలాలకు చేరుకున్నారు. కలికిరి మండలానికి చెందిన మహమ్మద్‌గౌస్, అఖిల్‌కుమార్, రామసముద్రం మండలానికి చెందిన నితీష్, నవ్యశ్రీ, శాంతిపురం మండలం తోపుచేనుకు చెందిన వినోద్‌కుమార్‌లు ఇక్కడికి వచ్చారు. కాగా, జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలకు చేరినట్లు సమాచారం అందింది.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement