నైపుణ్య కాలేజీలకు వేగంగా స్థల సేకరణ 

Rapid land acquisition for skill colleges - Sakshi

ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఏర్పాటు

ఒక్కో కాలేజీ నిర్మాణానికి రూ.20 కోట్ల వ్యయం

వచ్చే నెలలో శంకుస్థాపన

సాక్షి, అమరావతి: ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలల వద్ద ఉన్న మిగులు భూములను సేకరించి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో నైపుణ్య కళాశాల నిర్మాణం కోసం ఐదెకరాలు సేకరిస్తున్నట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో ఎన్‌.బంగారురాజు చెప్పారు. 25 కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు రావడంతో జూలై నెలాఖరులోగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఒక్కో కాలేజీ నిర్మాణానికి గరిష్టంగా రూ.20 కోట్లు వ్యయం చేయడానికి అనుమతిస్తూ మే 30న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ, నాలుగు ట్రిపుల్‌ ఐటీలతో పాటు పులివెందులలో మరో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేయనున్నారు.

కాలేజీల్లో వసతులివి.. 
స్థానిక పరిశ్రమలు, వాటికి అవసరమైన నైపుణ్యాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నారు. ఇందుకోసం పరిశ్రమల శాఖ చేపట్టిన సమగ్ర పారిశ్రామిక సర్వే నివేదికను ఏపీఎస్‌ఎస్‌డీసీ వినియోగించుకుంటోంది. ప్రతి నైపుణ్య కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌ నిర్వహణకు ప్రాంగణం ఉండేలా వీటిని నిర్మిస్తారు. స్థానికంగా ఉండే ఒకటి లేదా రెండు పరిశ్రమలతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ కేంద్రాలను వీటిలో ఏర్పాటు చేస్తారు. ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టి కోర్సు పూర్తికాగానే నేరుగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారు. ఈ కోర్సుల కాలపరిమితి మూడు నెలలు ఉండేలా చూస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top